ప్రేయసి కళ్ళల్లో ఉన్న కైపు ప్రియున్ని మత్తెక్కిస్తుంది. ప్రేయసి ప్రేమలోని మత్తు ప్రియుని మనసును ఉయ్యాలలూగిస్తుంది. ఆమె చేతిలో మధుపాత్ర కూడా ఉంటే ఇక మత్తులో మత్తుగా, సుతిమెత్తగా, గమ్మత్తుగా ప్రియుడు తూలిపడిపోవాల్సిందే. అలాంటి మత్తెక్కించే పాటను ‘పరమానందయ్య శిష్యులకథ'(1966) సినిమా కోసం శ్రీశ్రీ రాశాడు. ఆ పాటను చూద్దాం.
మహాకవి శ్రీశ్రీ అనగానే చాలామందికి ఉడుకెత్తించే విప్లవగీతాలో లేక పరిగెత్తించే ప్రబోధగీతాలో గుర్తుకొస్తాయి. కాని ఆయన వెచ్చవెచ్చగా, మత్తుమత్తుగా హుషారెక్కించే నిషాగీతాలను కూడా రాశాడని చాలామందికి తెలియదు. తన కవిత్వంతో ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక శకాన్ని సష్టించిన ఆ మహాకవి సినిమాకోసం ఎలాంటి సిచుయేషన్‌కైనా అలవోకగా పాటలు రాసి మెప్పించాడు. నిజానికి సినిమాకవి చేయవల్సిన పని కూడా అదే..
ప్రేయసి వలపు మత్తులో ఉంది. ప్రియుడు కూడా వలపు మత్తులో ఉన్నాడు. ఈ వలపు మత్తు వయసువల్ల వచ్చింది. వయసులోని కొంటెదనానికి వలపులోని తీయదనం తోడై మత్తు మరింత మత్తుగా ఇద్దరి మనసుల్ని ఊగిస్తోంది. చెప్పలేని ఆనందాల్లో పులకింపజేస్తోంది. అయితే ఆమె చేతిలో మధుపాత్ర ఉంది. అది ప్రియుని కోసమే తీసుకొచ్చింది. అది అతనికి తాగిస్తూ అతన్ని మధువువల్ల వచ్చిన మత్తులోను, తన కౌగిలి మత్తులోను తేలియాడించాలని ఆరాటపడుతుంటుంది. ప్రియుడు కూడా ప్రేయసి అందానికి దాసోహమంటూ మరీ మత్తులో తేలిపోతుంటాడు. ఆ ఇద్దరి ప్రణయానుభూతిని, ప్రణయావేశాన్ని పాటలో అద్భుతంగా పలికించాడు శ్రీశ్రీ.
ప్రేయసి ప్రియున్ని మన్మథునితో పోల్చుతోంది. రతిరాజా! అంటూ సంబోధిస్తుంది. అతని కోసం మధువును తీసుకొచ్చానని చెబుతోంది. అతడు రాజ్యమేలే మహారాజు. చివరలో మహారాజా! అన్న సంబోధన కూడా ఉంది. ఆ మధువు తాగుతూనే తన అందాన్ని కూడా ఆస్వాదించమనే అంతరార్థం కూడా పాటలో ఉంది. రతిరాజుగా, మహారాజుగా అతన్ని కీర్తించడం వెనుక, తన వయసును ఏలే రాజు అతడేనన్న అర్థమూ దాగి ఉంది. ప్రేయసి మాటలకు పరవశించిన ప్రియుడు ఆమె తెచ్చి ఇచ్చిన మధుపాత్రను తీసుకుని మధువును ఆస్వాదిస్తాడు.
నేను వచ్చింది నీకు మధువును అందించడానికి మాత్రమే కాదు. నీ అనురాగాన్ని నేను అందుకోవడానికి కూడా అని చెబుతుంది ప్రేయసి. నీ అనురాగంలో నేను పరవశిస్తుంటాను. నా మధువులో నువ్వు పరవశించు. అప్పుడు అంతులేని ఆనందంతో నేను ఆడుతూ, పాడుతూ ఉంటానని అంటుంది. సున్నితమైన, సన్ననైన తీగెలు పెనవేసుకుని ఊగినట్లుగా మనమిద్దరం పెనవేసుకుంటూ కలకాలం ఒక్కటిగానే ఉండిపోదామా అంటూ తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తుంది ఆ ప్రేయసి. అంటే.. మధువును ప్రియుడికి తెచ్చిచ్చి, అతని మనసును తాను తీసుకుంటుంది. ఇద్దరిలో ఉన్న మత్తు ఒకటై పోయి, వాళ్ళూ ఒక్కటిగా కలిసిపోతున్నారు.
ప్రేయసి పెదవిలో తీయని తేనెలున్నాయి. అంటే.. ఆమె ఇచ్చే మధుపాత్రలోని మధువు, ఆమె ప్రేమలోని మధువు మాత్రమే కాకుండా ఆమె పెదవిలో కూడా ముద్దులనే తేనెలున్నాయి. వాటిని కూడా తాగమని చెబుతుంది ప్రేయసి. ఆమె కన్నులలో ప్రణయ తరంగమూ ఉంది. అది అతన్ని స్వర్గ సుఖాల విహరింపజేస్తోంది. ఆమె పెదవిలోని తేనె, ఆమె కనులలోని ప్రణయతరంగం కలిసి ప్రవాహమై పొంగుతున్న సమయంలో ఆమె అందాన్ని అనుభవించుమని ప్రేయసి ప్రియున్ని కోరుతుంది. ఇద్దరి ప్రణయానందం అపురూపమైన ఈ పాటగా వినబడుతోంది. శ్రీశ్రీ కలంలోని ప్రణయ కవితా మాధుర్యానికి ఇదొక మచ్చుతునక.
పాట:
ఇదిగో వచ్చితి రతిరాజా!/
మధువే తెచ్చితి మహరాజా!/
అందజాలితి నీ అనురాగం/
అంతులేనిదీ నా ఆనందం/
లలితములైన లతల విధాన/
కలిసిపోదమా కలకాలం/
మగువ పెదవిలో మధుర మరందం/
చెలియ కనులలో ప్రణయతరంగం/
వెల్లువలైన ఈ సమయాన/ అనుభవింపుమా ఈ అందం..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com