ధ్యేయపు దారి పట్టుకు వెళితే, గమ్యం కాదా మధుశాల

If the path of the goal goes to Patt, the destination is Madhushalaభావుకత ఒక ద్రాక్షలత, లాగు కల్పనల తీగజత
కవియే సాకీ యై వచ్చాడు నింపుకుని కవితా మధు పాత్ర
ఇసుమంతైనా ఖాళీ అవదు లక్షతాగినా లక్ష ఆగినా
పాఠక జనమే తాగేవారు, పుస్తకమే నా మధుశాల.
అని చెప్పుకున్నవాడు ప్రసిద్ధ హిందీకవి పద్మభూషణ్‌ డాక్టర్‌ హరివంశ్‌ రారు బచ్చన్‌. ఒక లోతైన తాత్విక చింతనతో, నిగూఢమైన భావావేశంతో జలపాతంలా సాగిపోయిన హరివంశ్‌రారు కావ్యం ‘మధుశాల’ నన్ను ఆకట్టుకుంది. దాన్ని ఎలాగైనా తెలుగు పాఠకులకు అందించాలని తహతహలాడాను. కానీ, నేనేమో భాషా పండితుణ్ణి కాదు. హిందీమూలంలో ఉన్న ఆ లయలు, హోయలు తెలుగులోకి తెచ్చేదెట్టా? అదే భావాన్ని తెలుగు వచన కవిత్వంలోకి మారిస్తే బావుండదు. తేలిపోతుంది. మరి ఎలా? ఎలా అని కూర్చుంటే లాభం లేదు. శ్రమించాల్సిందే. సాధించాల్సిందేనని కొన్ని నెలలపాటు నేను మధుశాల వెంటపడ్డాను. ఇకనేం, ఆతర్వాత అదే నా వెంటపడుతూ ఇదిగో ఇలా వచ్చింది.
కోరుకున్న మధువేదైతే ఉందో అంద లేదు నాకిప్పటికి
కోరుకున్న మధుపాత్రా అంతే, అందదు కద నాకెప్పటికి
వెర్రివాడి వలె వెంట పడితినా? అయినా అందదు ఆసాకీ
పిచ్చివాడి వలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల.
లోగడ నూటయాభై మంది భారతీయ భాషల కవుల్ని ‘కవితా భారతి’ ద్వారా తెలుగు సాహిత్యలోకానికి అందించిన తర్వాత, నేను ఒకటిన్నర దశాబ్ద కాలంగా కవిత్వానువాదాల వైపు దృష్టి మరల్చలేదు. ఆ సమయంలో యాదృచ్ఛికంగా ‘మధుశాల’ నన్నాకర్షించింది. మధువు ఇతివత్తంగా గొప్ప కవిత్వం పండించిన హరివంశ్‌ రారు తాగుడుకు అలవాటు పడలేదు. అంతేకాదు, ఆయనకు మధువు రుచికూడా తెలియదన్న విషయం తెలుసుకున్నాక, ఆయనపై ఒక గౌరవభావం కలిగింది. అందుకే తెలుగు అనువాదానికి పూనుకున్నాను. మూలకవితలోని భావం, లయ, ప్రవాహగణం ఏ మాత్రం పోకుండా తెలుగు చేయగలిగాను. ఈమాట నాకు నేను చెప్పుకుంటున్నది కాదు, నా సహ రచయితలెంతో మంది పరిశీలించి చెప్పినమాట.
ఉత్తరభారత దేశమంతా హరివంశ్‌ రారు శతజయంతి ఉత్సవాలు 2007లో ఘనంగా జరిగాయి. ఆయన్ను, ఆయన కావ్యాన్ని తెలుగు సాహితీ జగతికి పరిచయం చేయాలని చేసిన చిన్న ప్రయత్నం ఇది. మధుశాల -అంటే ఇక్కడ కేవలం మధుశాల కాదు. ఒక ధ్యేయానికి, ఒక గమ్యానికి అది సంకేతం! ధ్యేయాన్ని బట్టి ఒక్కొకరి మధుశాల ఒక్కోరకంగా మారుతూ ఉంటుంది.
నీ హదయపు లోతెందుందో మధుపాత్రలో లోతంతుంటుంది.
నీ మనసున మత్తెంతుందో మధువున మత్తంతుంటుంది.
నీ భావుకత అందం ఎంతో సాకీ అంతటి సుందరము
ఎప్పుడెంతటి రసికుడు అయితే, అంతటి రసమయము మధుశాల. డాక్టర్‌ హరివంశ్‌ రారు బచ్చన్‌ 1907 -2003 మధ్యకాలంలో 36 ఏండ్లపాటు జీవించాడు. 30 కవితా సంపుటాలు ప్రచురించాడు. మరో 50 ఇతర గ్రంథాలు రాశాడు. ఆయన ఆత్మకథ నాలుగు సంపుటాలుగా వెలువడింది. 1935లో ప్రకటించిన ‘మధుశాల’ ఆయనకు జగద్విఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన ‘మధుబాల’ ‘మధు కలష్‌’ కావ్యాలు కూడా ప్రక టించాడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్‌ సాధించిన మొదటి భారతీయుడీయన. నాటి భారత ప్రధాని పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూకు ప్రేమ పాత్రుడయ్యాడు. అంతే – లెక్చరర్‌గా, ఆకాశవాణి ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌ ఉన్నవాడల్లా నేరుగా భారత విదేశాంగ శాఖలో ఉన్నత పదవికి ఎంపికయ్యాడు. అక్కడి నుండి ఆయన ఉద్యోగిగా, కవిగా మళ్లీ వెనకి తిరిగి చూడలేదు. హిందీ మనరాష్ట్ర భాష కావడానికి ముఖ్యమైన భూమికను పోషించాడు. హిందీ సాహిత్యరంగంలో ‘హాలా వాదాన్ని’ (మధువాదాన్ని) ప్రతిపాదించి, పోషించినవాడిగా పేరు గడించాడు.
హిందూ ముస్లిం వేరైనా మధుపాత్ర ఒక్కటే తాగేది
మధువూ ఒకటే సాకీ ‘ఒకటే’ మధుశాల ఒకటే వెళ్లేది
మందిరమైనా మజ్జీదైనా వెళ్లేవరకూ ఇద్దరు-ఒకటే
విడగొట్టేవే మందిర్‌ మజ్జిద్‌, మనసులు కలిపేదే మధుశాల.
‘హాలా – అంటే మధువు. మనిషి తనకు కావల్సిన దాన్ని వెతుక్కోవడంలోనే ఆనందం పొందుతూ ఉంటాడు. ‘మధువు’ అంటే మధువే కానక్కర్లేదన్నది ఆయన చెప్పే అంతరార్థం. ఉమర్‌ ఖయ్యాం, గాలిబ్‌, జఫర్‌, మీర్‌, కులీ,వలీ వంటి ఉరుదూ మహాకవుల అడుగు జాడల్లో, వారి బాణీలో మధువు – మధుపాత్ర – సాకీ- మధుశాల వంటి పదాలనే వాడుతూ – వారికి భిన్నంగా సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక విషయాలపై ఆయన కవితలల్లారు. ఉదాహరణకు ఈ కింది కవితా చరణాలు గమనించండి. విషయం అర్థమవుతుంది.
హిమశ్రేణులే ద్రాక్షాలతలు హిమజలమే ప్రవహించే మధువు
నదులన్నీ సాకీ హొయలవగా కెరటాలే మధుపాత్రలు కాగా
తాగిన మత్తులో పచ్చగ ఊగెను పంట పొలాలు కాలం గతిలో
ప్రపంచానికిది ఆదర్శం వ్యవసాయ భారతం మధుశాల.
ధీరపుత్రుల హృదయ రుధిరమే అయినది నేడు రక్తపు మధువు
దేశభక్తుల ఆశీస్సుల మధుపాత్ర తీసుకుని ముందుకు నడువు
అతి ఉదారము గుణము భారతిది, త్యాగశీలి సాకీ
బలికోరే స్వాతంత్రమే కాళిక – ఇక బలి వేదిక మధుశాల
– ఇలా విషయమేదైనా దాన్ని మధుశాల పరిధిలోకి లాగి, అత్యద్భుతమైన పద చిత్రాలతో రక్తి కట్టించడం – హరి వంశ్‌ రారు సాధించగలిగాడు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ‘బచ్చన్‌’ వారి ఇంటి పేరు కాదు. వారి ఇంటి పేరు శ్రీవాత్సవ. హరివంశ్‌ రారుని బాల్యంలో ముద్దుగా అందరూ ‘బచ్చన్‌’ అని పిలిచేవారు. బచ్చన్‌- అంటే చంటాడు, పసివాడు, కుర్రాడు అని అర్థం. కేంబ్రిడ్జి నుండి తిరిగి వచ్చాక ఉధతంగా హిందీలో కవిత్వం రాస్తున్నప్పుడు ఆయన సరదాగా తన చిన్నప్పటి ముద్దుపేరు తగిలించుకుని, హరివంశ్‌ రారు బచ్చన్‌గా ప్రసిద్ధుడయ్యాడు. ప్రసిద్ధి పొందిన ఆ పేరును వదులుకోవడం ఇష్టంలేక, కొడుకు, మనవడు అందరూ బచ్చన్లుగా కొనసాగుతున్నారు. కుటుంబమే బచ్చన్‌ కుటుం బమై పోయింది. అసలైన ఇంటిపేరు శ్రీవాత్సవ మరుగునపడింది. విశ్వమానవ కుటుంబాన్ని ఆయన ఇలా ఒకచోట నమోదు చేశాడు.
మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల
ధ్యేయపు దారి పట్టుకు వెళితే గమ్యం కాదా మధుశాల?
కళ్లకు కనబడునది ఏదైనా, ఇక కళ్లలో ఉన్నది మధుశాల
అంతట కనబడు అన్ని వేళలా – విశ్వవ్యాప్తమిది మధుశాల!
హరివంశ్‌ రారు బచ్చన్‌ నవంబర్‌ 27, 1907న అలహాబాదు దగ్గర్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. వారిది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం. వారి వంశంలో కొనసాగుతూ వస్తున్న ఆచారం ప్రకారం కాయస్తు పాఠశాలలో ఉరుదూ చదువుకుని, 1925లో మెట్రిక్యులేషన్‌, 1929లో ప్రథమశ్రేణిలో బి.ఏ(అలహాబాదు విశ్వ విద్యాలయం) తర్వాత బి.టి, మరికొంత కాలానికి బనారస్‌ విశ్వావిద్యాలయం నుండి యం.ఎ. పూర్తిచేశాడు. మధ్య కాలంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సమయంలోనే గాంధీజీ అనుచరుడిగా మారి, దేశ స్వాతంత్రోద్యమంలోకి దూకాడు. 1941-52 మధ్య కాలంలో అలహాబాదు యూనివర్సిటీలో ఇంగ్లీషు బోధించాడు. తర్వాత రెండేండ్లు కేంబ్రిడ్జిలోని సెంట్‌ కేథరిన్‌ కాలేజిలోని థామస్‌ రైస్‌ హెన్‌ దగ్గర చేరి, ఐరిష్‌ కవి వై.బి. ఈట్స్‌ పై పరిశోధన సాగించి, డాక్టరేట్‌ సాధించి, స్వదేశం తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా మధుశాల, మధుబాల, మధుకలష్‌ సంపుటాలు – నిషా నిమంత్రణ్‌, ఏ కాంత సంగీత్‌, అకుల్‌ అంతర్‌, సారంగిని, హాలాహల్‌, బెంగాల్‌ క కావ్య్‌, ఖాదీ కె ఫూల్‌, సూత్‌కి మాలా, మిలన్‌ యామిని, ప్రణయ పత్రిక, ధార్‌ కి ఇధర్‌- ఉధర్‌, ఆర్తీ అవుర్‌ అంగారే, బుద్ధఅవుర్‌ నాచ్‌ఘర్‌, త్రిభంగిమీ – వంటి కవితా సంపుటాలు 1932-1961 మధ్యకాలంలో ప్రకటించాడు.
నిజానికి హరివంశ్‌రారు సాహిత్యరంగ ప్రవేశం 1930లో కథారచనతో ప్రారంభమైంది. మూడు నాలు గేండ్లు కథలు రాశాడు. మొదటి కథా సంపుటి రాత ప్రతిని ‘హిందుస్థానీ అకాడెమీ’కి పంపాడు. కానీ, వారు దాన్ని తిరుగు టపాలో తిప్పిపంపారు. ఉక్రోషంతో ఆయన రాతప్రతిని చెత్తబుట్టకు సమర్పించి, కథారచనకు స్వస్తి చెప్పాడు. తర్వాత కవితా ప్రక్రియలో కషి ప్రారంభించి జనవరి 1932లో ‘తేరా హార్‌’ తొలి కవితా సంపుటి ప్రకటించాడు. క్యా భూలూ ఁ క్యాయాద్‌ కరూ’ ‘నీడ్‌ క నిర్మాణ్‌ ‘ ‘ఫిర్‌ బసేరేసే దూర్‌’ ‘దశ్‌ ద్వార్‌ సే సోపాన్‌ తక్‌’ అనే శీర్షికలతో ఆత్మకథ నాలుగు సంపుటాలలో వెలువరించాడు. ఈ నాలుగింటి సారాంశం క్లుప్తంగా ×చీ ునజు Aఖీుజు= చీఉఉచీ ఉఖీ ు×వీజు శీర్షికతో ఇంగ్లీషులో వెలువడింది. దానికే ఆయనకు సరస్వతీ సమ్మాన్‌ (1991) లభించింది.
హరివంశ్‌ రారు తన యాభైయేండ్ల సాహిత్య జీవితంలో కొన్ని ముఖ్యమైన అనువాదాలు కూడా చేశారు. ఉమర్‌ ఖయ్యాం, వై.బి.ఈట్స్‌లను హిందీలోకి అనువదించాడు. ‘నెహ్రూ-రాజనైతిక్‌ జీవన్‌చిత్ర్‌’ (1961) అనేది చెప్పుకోదగ్గ రచన. సుమిత్రానందన్‌ పంత్‌పై రెండు పుస్తకాలు ప్రకటించాడు. ‘అఠ్‌వీ దశక్కి ప్రతినిధి శ్రేష్ఠ్‌ కవితాయే’ (1982) శీర్షికతో ఆనాటి యువతీయువకుల కవితల్ని సంపుటీకరించాడు. తన ప్రవాస జీవిత విశేషాల్ని ‘ప్రవాస్‌ కి డైరీ’ శీర్షికతో ప్రకటించారు. హిందీ సాహిత్యరంగంలో ఆయన చేసిన కషికి సాహిత్య అకాడెమీ అవార్డు, సోవియట్‌ ల్యాండ్‌ అవార్డు, ఆఫ్రో ఏసియన్‌ రచయితల సమాఖ్యవారి లోటస్‌ అవార్డు, సరస్వతి సమ్మాన్‌ వంటి అత్యున్నత పురస్కారాలు స్వీకరించిన హరివంశ్‌ రారుకి 1976లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ ప్రకటించి గౌరవించింది. 1966లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యాడు. 2003లో భారత తపాలా శాఖ పోస్టల్‌ స్టాంపు విడుదల చేసింది. ”నా కవిత్వం మోహంతో మొదలై, మోహ బంధంతో ముగిసింది” – అని హరివంశ్‌రారు తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. 19వ యేట 14 ఏండ్ల శ్యామను పెండ్లాడితే ఆమె టి.బితో బాధపడి చనిపోయింది. అందువల్ల, 14 ఏండ్ల తర్వాత 1941లో తేజి సూరి అనే సిక్కు యువతిని పెండ్లి చేసుకున్నాడు. ఇప్పుడున్న బచ్చన్‌లు ఆమె సంతానమే.
ఒకసారి హరివంశ్‌రారు గాంధీజీని కలవడానికి వెళ్లాడు. ”మధువు -సారాయిపై కవిత్వం రాసే కవిని తాను కలుసుకోదలుచుకోలేదని” – అన్నారాయన. మధ్యలో ఒకరు కల్పించుకుని ‘ఆయన ఏ సారాయి (మధువు) గురించైతే చెపుతున్నారో అది సారాయి కాదు- ప్రేమకు, ఆధ్యాత్మికతకు, జీవనగమ్యానికి సంబంధించిన సంకేతమని’ వివరించి చెప్పాడు. అది తెలుసుకుని గాంధీజీ సంతోషించి హరివంశ్‌రారుని లోపలికి పిలిచాడు.
పూజారే మన ప్రియతమ సాకీ, పవిత్ర గంగా జలమే మధువు
తపోనిష్టలో తిప్పుతు ఉండే జపమాలే మధు పాత్రల మాల
ఇంకా తాగు, ఇంకా తాగు అన్నదె మంత్రోచ్ఛారణ కాగా
శివలింగం వలె శిలనౌతాలే మందిరమైనా, మధుశాలైనా
(18 జనవరి, హరివంశ్‌ రారు వర్థంతి)
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

డాక్టర్‌ దేవరాజు మహారాజు