ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ‘లవ్ టుడే’తో దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందు తున్న చిత్రమే ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో 26వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇంతకు ముందు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియో, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రైజ్ ఆఫ్ డ్రాగన్ అనే ఎనర్జిటిక్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘మధువరమే..’ అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. లియోన్ జేమ్స్ అందించిన బాణీ, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శరత్ సంతోష్, శ్రినిష జయసీలన్ గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటను యూరోప్‌లో షూట్ చేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ పాట వినడానికే కాకుండా చూడటానికి కూడా ఎంతో ప్లెజెంట్‌గా కనిపిస్తోంది. ప్రదీప్‌రంగనాథన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ మంచి ఆసక్తి ఉంటుంది. అలాగే అంచనాలూ ఉంటాయి. వాటికి మించి ఈసినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలం. అలాగే ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తాం అని మేకర్స్ తెలిపారు. ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే, ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్, మిస్కిన్, వి.జె.సిద్ధు, హర్షత్ ఖాన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు.