బీఆర్‌ఎస్‌లోకి మధ్యప్రదేశ్‌ నేతలు

కేసీఆర్‌ సమక్షంలో చేరిన బుద్దసేన్‌ పటేల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌లో చేరికల పరంపర నిర్విరామంగా సాగుతున్నది. మంగళవారం మరో ముఖ్యఘట్టం చోటుచేసుకున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి చేరికలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీతో సహా మాజీ ఎమ్మేల్యేలు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజల్లో పట్టువున్న ముఖ్యనేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రేవా పార్లమెంటరీ నియోజవర్గం బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బుద్ద సేన్‌ పటేల్‌ బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు బీఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే డా.నరేశ్‌సింగ్‌ గుర్జార్‌, ఎస్పీకి చెందిన సాత్నా మాజీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్‌, సాత్నా జిల్లా మాజీ పంచాయత్‌ సభ్యులు విమల బాగ్రి, సర్వజన్‌ కళ్యాణ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజరుయాదవ్‌, భోపాల్‌కు చెందిన రాకేశ్‌ మాల్వీయ, సత్యేంద్ర సింగ్‌ తదితరులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ బుద్ధసేన్‌ పటేల్‌ను మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌గా జాతీయ కేసీఆర్‌ నియమించారు. తాము మధ్యప్రదేశ్‌కు తిరిగివెళ్లిన తర్వాత ఇప్పటికే ఆసక్తితో ఎదురుచూస్తున్న అక్కడి ప్రజలు, నేతలతో సమావేశమై విస్తతంగా చర్చించనున్నట్టు పార్టీలో చేరిన నేతలు తెలిపారు. తెలంగాణ మోడల్‌ పాలన కోసం మధ్యప్రదేశ్‌ ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అనంతరం భోపాల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, సభకు అధినేత కేసీఆర్‌ను రావాల్సిందిగా వారు ఆహ్వానించారు. చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ తదితరులు పాల్గొన్నారు.