డిసెంబరు నాటికి మేడిగడ్డ మరమ్మతులు..!?

డిసెంబరు నాటికి మేడిగడ్డ మరమ్మతులు..!?– ఐదు కమిటీలు వేసినా అడుగుల్లో తడబాటే
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరంలోని బ్యారేజీలకు మరమ్మతులు ఇప్పట్లో సాధ్యం కావని సాగునీటిరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌ రెండో వారం నుంచి వానాకాలం సీజన్‌ ప్రారంభం కానున్నట్టు వాతావరణ శాఖ చెబుతున్నది. మరో రెండు వారాల్లో ఎన్డీఎస్‌ఏ సిఫారసులను అమలుచేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నవి. మేడిగడ్డ బ్యారేజీ తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పట్లో మరమ్మతులు చేయడం సాధ్యం కాదనే ప్రచారం జలసౌధలో జరుగుతున్నది. ‘మేము ప్రయత్నాలు చేస్తున్నాం..సాధ్యమైనంత మేర మరమ్మతులు చేస్తాం..మిగిలింది కాలం నిర్ణయిస్తుంది’ అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘నాకు తెలిసి ఆ బ్యారేజీకి ఇప్పుడు మరమ్మతులు చేయడం అనవసరం.. వానల తర్వాతే దాని సంగతి తేల్చాలి.. డిసెంబరు వరకు మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంది..ఎన్డీఎస్‌ఏ సిఫారసుల ప్రకారం వరదను ఆపకుండా వదిలేయాలి’ అని మరో అధికారి అభిప్రాయపడ్డారు. వర్షాల వరదకు ఆటంకం కాకుండా మేడిగడ్డ గేట్లను మొత్తం ఎత్తేయాలి.. అలాగే ఇసుక మేటలను తొలగించాలి.. ఇప్పుడా పని జరుగుతున్నది కదా అని అభిప్రాయపడ్డారు. దిలావుండగా ప్రాణహిత నదికి ఇప్పటికే వరద వస్తున్నట్టు సాగునీటిశాఖ అధికారులు అంటున్నారు .వానలు పెరిగి జూన్‌ రెండో వారం నాటికి అది ఉధృతమయ్యే అవకాశం ఉందనీ, అప్పుడే అసలు పరీక్ష ఎదురుకానుందని అంటున్నారు. బ్యారేజీ ప్రస్తుత సామర్థ్యాన్ని అంచనా వేయడం కూడా కష్టంగానే ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. గతంలో ఎన్డీఎస్‌ఏ బృందాలు రెండుసార్లు వచ్చి బ్యారేజీని తనిఖీ చేశాయి. వచ్చే వానాకాలం వరదను బ్యారేజీ తట్టుకుంటుందని చెప్పడం కష్టమేననీ, గ్యారంటీ లేదని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అలాగే సీడబ్ల్యూసీకి చెందిన పుణే బృందం కూడా రెండు రోజుల కింద వచ్చి పరిశీలించింది. ఇప్పుడు బ్యారేజీ దగ్గర టెస్ట్‌లు జరుగుతున్నాయి. మరమ్మతుల కంటే ముందు వీటిని నిర్వహించాలని ఎన్డీఎస్‌ఏ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ పరీక్షలు చేసన తర్వాత మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్‌ఏ ఆదేశించిన నేపథ్యంలో సాగునీటి శాఖ ఇంజినీర్లు వర్కింగ్‌ ఏజెన్సీ ఎల్‌ అండ్‌ టీతో కలిసి పరీక్షలకు పూనుకుంది. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షల సందర్భంగా భారీ శబ్దాలు వచ్చినట్టు తెలిసింది. మేడగడ్డి బ్యారేజీకి మొత్తం 85 గేట్లున్నాయి. ఏడో బ్లాకులోని 16వ గేటు తొలగించే క్రమంలో శబ్దాలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఆ గేటు కింది భాగంలో గోతులు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయాలను సాగునీటి శాఖ ఇంజినీర్లు ధృవీకరించడం లేదు. 16,17,18,19, 21, 21 గేట్లు పూర్తిగా బిగుసుకుపోయాయని తెలిసింది. వాటిని ఎత్తాలంటే వాటికింది భాగంలో ఉన్న రాఫ్ట్‌ను తొలగించాల్సి ఉంటుందని ఇంజినీర్లు అంటున్నారు. ఆ తర్వాతే గేట్టు ఎత్తాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా ఆరో బ్లాకుకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నవారూ లేకపోలేదు. వానాకాలంలో రైతులు, ఇతర సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను వాడుకుంటే సరిపోతుందని రిటైర్డ్‌ ఇంజినీర్లు, సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సర్కారు ఆదేశించినా, బ్యారేజీ భౌతిక పరిస్థితులు సహకరించకపోవచ్చని కూడా అంటున్నారు. వర్షాలు ఆటంకం కానున్నాయని అంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువన రాక్‌ఫిల్డ్‌ డ్యామ్‌ లేదా రబ్బరు డ్యామ్‌ కట్టాలని భావిస్తున్నారు. ఇథమిద్దంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికి, ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. పురాతన కాలంనాటి ఐడియాలజి ప్రకారం వీటిని నిర్మించి వరదను నియంత్రించడం, తద్వారా సాగునీటి అవసరాలు తీర్చుకోవాలనే అంచనా ఉంది. ఇందుకోసం రూ. 600 కోట్లు ఖర్చవుతాయనీ, ఈ నిధులను ఎల్‌అండ్‌టీనే భరిస్తుందని అంటున్నారు.