వైభవంగా ముదిరాజుల పెద్దమ్మతల్లి బోనాలు..

– పట్టువస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్మన్,కమిషనర్..
– హాజరైన ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు.. 
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దేవతలైన శ్రీ పెద్దమ్మ-దుర్గమ్మ అమ్మవార్ల బోనాల పండుగను సంఘం అధ్యక్షుడు పిల్లి మధు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని శ్రీ బద్ది పోచమ్మ తల్లి, పెద్దమ్మ-దుర్గమ్మ అమ్మవార్లకు ప్రత్యెక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం ముదిరాజ్ మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం తరుపున చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కమిషనర్ అన్వేష్ లు అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవార్లను దర్శించుకుని ముదిరాజ్ కులస్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఛైర్ పర్శన్ మాధవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీలో భాగంగా పెద్దమ్మ-దుర్గమ్మ అమ్మవార్లకు మున్సిపల్ పాలకవర్గం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.అమ్మవార్లకు బోనాలు తీసే సాంప్రదాయం ఆనాటి కాలం నుండి వస్తుందని,ఆ అమ్మవార్ల ఆశీర్వాదాలు ప్రజలందరిపైన ఉంటూ చేసే పనులలో విజయాలు సాధించాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు.ముదిరాజ్ కులస్తులకు బోనాల పండగను సంతోషంగా జరుపుకోవాలని పేర్కోన్నారు. అనంతరం బోనాల ఉత్సవాలకు వచ్చిన అథితులను ముదిరాజ్ సంఘం నాయకులు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, వైస్ చైర్మన్ బింగి మహేష్, స్థానిక కౌన్సిలర్ మారం కుమార్, గౌరవ కౌన్సిలర్లు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, ముదిరాజ్ కుల బాంధవులతో పాటు పెద్ద ఎత్తున ముదిరాజ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవార్లకు బోనాల సమర్పణ
ముదిరాజుల ఆరాధ్య దేవతలైన పెద్దమ్మ-దుర్గమ్మ బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం బద్ది పోచమ్మ అమ్మవారికి ముదిరాజ్ మహిళలు బోనాలు సమర్పించారు. అనంతరం సాయంత్రం పట్టణంలోని మహాలక్ష్మీ వీధిలో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ-దుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.వర్షాలు సంవృద్దిగా కురిసి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.