మహబూబ్‌ నగర్‌, ఆదిలాబాద్‌ జోరు

Mahbub Nagar Adilabad Joru– టీడీసీఏ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌
హైదరాబాద్‌ : తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) నిర్వహిస్తున్న అండర్‌-17 టీ20 టోర్నమెంట్‌లో మహబూబ్‌ నగర్‌, ఆదిలాబాద్‌ జట్లు ముందంజ వేశాయి. మంగళవారం దోమలగూడలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో మెదక్‌పై మహబూబ్‌ నగర్‌ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. రవితేజ (82 నాటౌట్‌) అర్థ సెంచరీతో మహబూబ్‌ నగర్‌ తొలుత 20 ఓవర్లలో 178/8 పరుగులు చేసింది. ఛేదనలో మెదక్‌ 20 ఓవర్లలో 145/9 పరుగులే చేసింది. రెండో మ్యాచ్‌లో నిజామాబాద్‌ (127/10)పై టీడీసీఏ (169/8) ఎలెవన్‌ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. 18 ఓవర్ల మ్యాచ్‌లో ఆదిలాబాద్‌ 117/8 పరుగులు చేయగా.. వరంగల్‌ 15.4 ఓవర్లలో 84 పరుగులకే చేతులెత్తేసింది. 33 పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ ఘన విజయం సాధించింది. రెండో రోజు పోటీలను టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి టాస్‌ వేసి ప్రారంభించారు.