– ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌తో పాటు 9 మంది బదిలీ
నవతెలంగాణ-మహాదేవపూర్
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిపై పోలీస్‌శాఖ చర్యలకు ఉపక్రమించింది. సోమవారం మహాదేవపూర్ పోలీస్ సిబ్బంది ఏడుగురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారడంతో జిల్లా ఎస్పీ స్పందించి ఎస్‌ఐ ప్రసాద్‌ను వీఆర్‌కు అటాచ్ చేసి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఇసుక, గుడుంబా, ఇతర కారణాలతో ఏడుగురు కానిస్టేబుళ్లను ఇతర పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. దాంతో మహదేవపూర్ పోలీస్ స్టేషన్ ఖాళీగా దర్శనమిస్తోంది. మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌కు వివిధ గ్రామాల నుంచి భూ తగాదాలు, కొట్లాటల కేసులు వస్తుంటాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న పోలీస్‌స్టేషన్ కావడంతో మావోయిస్టుల ప్రభావమూ ఎక్కువగానే ఉండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు పూర్తిస్థాయిలో పోలీసు బలగాలను నియమించాలని కోరుతున్నారు.