సెప్టెంబర్‌ 4న విద్యుత్‌సౌధలో మహాధర్నా

– బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ పిలుపు
– పదోన్నతులు ఇవ్వనందుకు నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ సంస్థల్లో మెరిట్‌ కమ్‌ సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరుతూ సెప్టెంబర్‌ 4వ తేదీ విద్యుత్‌సౌధలో మహాధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ, ఓసీ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) తెలిపింది. ఈ ధర్నాలో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థల ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. మంగళవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మెన్‌ కోడెపాక కుమారస్వామి, కో చైర్మెన్‌ ఆర్‌ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్‌ ముత్యం వెంకన్నగౌడ్‌, కో కన్వీనర్‌ సీ భాను ప్రకాష్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, 2014 జూన్‌ 2 నుంచి ఇచ్చిన పదోన్నతుల్ని సమీక్షించి, నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. విద్యుత్‌ సంస్థల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమించబడిన ఉద్యోగుల సీనియార్టీని మెరిట్‌ ఆధారంగా నిర్థారించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌, ఆర్థిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్‌ ఉద్యోగుల పదోన్నతుల విషయంలోని సమస్యల్ని పరిగణనలోకి తీసుకొని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిజన్లకు గతంలో యాజమాన్యాలు ఒప్పుకున్న విధంగా పదోన్నతులు కల్పించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా, సామరస్యంగా పరిష్కరించాలనీ, లేనిపక్షంలో విద్యుత్‌ సంస్థల్లో కులాల ఆధిపత్యం పెరిగి, ఉద్యోగుల మధ్య విభజన వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.