జర్నలిస్టుల ‘మహాధర్నా’

18న హైద్రాబాద్‌లో
ఇండ్ల స్ఠలాల కోసం

టీడబ్ల్యూజేఎఫ్‌
ఆఫీసు బేరర్ల నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఇండ్ల స్థలాల కోసం ఈనెల 18 (గురువారం) న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద జర్నలిస్టుల ”మహాధర్నా ” నిర్వహించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అన్‌లైన్‌లో జరిగిన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశం తీర్మానం చేసింది. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొ నాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి , రంగారెడ్డి , వికారాబాద్‌ , యాదాద్రి – భువనగిరి , సూర్యాపేట , నల్లగొండ ,వరంగల్‌ , మహాబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జర్నలిస్టులను ఎక్కువగా సమీకరించనున్నట్టు ప్రకటించింది. మహాధర్నా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందనీ, సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని తెలియజేసింది. రాష్ట్రంలోని ఫెడరేషన్‌ అన్ని జిల్లా కమిటీలు మహాధర్నాను విజయవంతం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆన్‌లైన్‌ ఆఫీసు బేరర్ల సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి కె. వెంకటేశ్‌ అద్యక్షత వహించగా ఇతర ఆఫీసు బేరర్లు ఇ చంద్రశేఖర్‌, వై. ప్రభాకర్‌, ఎస్‌.కె సలీమ, బి. జగదీశ్‌, బి. రాజశేఖర్‌, గుడిగ రఘు, కె. నిరంజన్‌, వి. జగన్‌. టి. శ్రీనివాస్‌, పి. భిక్షపతి, బి. దయాసాగర్‌, కె.అనిల్‌రెడ్డి, టి.కృష్ణ, ఆర్‌.వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇండ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా జాప్యం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇండ్లస్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండ్లస్థలాల సాధన కోసం గత రెండు నెలలుగా నాలుగు దశల కార్యక్రమాన్ని ఫెడరేషన్‌ చేపట్టిందని గుర్తు చేశారు. తొలి దశలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల సంతకాల సేకరణ, రెండో దశలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేసినట్టు చెప్పారు. మూడో దశలో అన్ని జిల్లాల కలెక్టరేట్లు, జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టినట్టు వివరించారు. నాలుగో దశలో హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టినట్టు తెలి పారు. ఈకార్యక్రమానికి భారీగా జర్నలిస్టులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.