చైతన్యపు మహాఝరీ!

Mahajhari of Chaitanya!విప్లవపథ శ్రామికుడా.. అరుణోద్యమ ప్రేమికుడా
సమసమాజ స్వాప్నికుడా సమరశీల నాయకుడా..
చైతన్యపు మహాఝరీ.. కామ్రేడా ఏచూరీ…
అందుకో జోహార్లు… ప్రియనేతా జోహార్లూ
బరువెక్కిన గుండెలతో, ఎర్రెర్రని దండాలూ!

నువ్వుంటే మాకెంతో బలముందని తలచేము
నీ మాటల శక్తులతో ఉత్సాహం పెరిగేనూ
శత్రువుకూ నువ్వంటే శస్త్రముగా కనిపించేవు
మిత్రుల హృదయాలలో, స్నేహమయి పూచేవూ-

చదువులోన మొనగాడివి సమూహాన చెలికాడివి
నిర్భయాల జతగాడివి నిజాయితీకి తోడువి
ఆలోచనల సముద్రానివి సైద్ధాంతిక మేధావివీ
ఆచరణాచరణానివీ అలుపెరగని పోరువీ-

సుందరయ్య సూర్జిత్‌గారు, ఈఎమ్మెస్‌, మాకినేని
శిష్యులుగా ఎదిగిన మీరు శిఖరముగా నిలిచారు
వారి అడుగు జాడలలోన అనునిత్యం నడిచారు
ఎర్రజెండ మెరుపుల కళను రెపరెపలా ఎగిరేసారు-

మతత్వం విచ్ఛిన్నాలను మట్టుబెట్ట కదిలారు
కులతత్వం కుత్సితాలు మానవతకె మచ్చన్నారు
శ్రామికులా దోపిడి చేసే కుట్రగుట్టు విప్పారు
హక్కులనణిచే రాజ్యంపై నిప్పులనే కురిపించారు-

సహచరులకు ప్రేమను పంచిన సహృదయం నీదయ్యా
నిఖార్సయిన కమ్యూనిస్టుకు నిదర్శనం నీవయ్యా
జనవిముక్తి సమరంలో జీవితాన్ని అర్పించావు
మాగుండెల లయలో నీవు కదలాడుతుంటావూ

– కె. ఆనందాచారి