నవతెలంగాణ-పెద్దవంగర: మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర సంజీవ రావు ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాల్లోని రెండు పథకాలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వయస్సుతో సంబంధం లేకుండా, ప్రతీ మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. కాగా, వారికి ‘రూ.0’ టికెట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, వినోద్, వీరారెడ్డి, జ్యోతి, వెంకటమ్మ, యాకన్న, కిషోర్, రాజు, మరియమ్మ, రజియా, కవిత, సతీష్, మహేష్, ప్రశాంత్ రెడ్డి, రమా, మంజుల, యశోద, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.