మహాలక్ష్మి పథకం మా బ్రతుకులను దీనస్థితిలో పడేసింది 

– ప్రైవేట్ వాహనాలను నడుపుకునే డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి 
– ఆటో డ్రైవర్ల ఆవేదన
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ప్రైవేట్ వాహనాలను నడుపుకుంటూ చాలిచాలని మిగులుబాటుతో  నెట్టుకొస్తున్న మా బ్రతుకులను రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన మహాలక్ష్మి పథకం మరింత దయనీయ స్థితిలో పడేసిందని ఆళ్ళపల్లి టాటా మ్యాజిక్, ఆటో డ్రైవర్ల సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్, మొహమ్మద్ సద్దాం వాపోయారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో మ్యాజిక్ లు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..  ప్రైవేట్ వాహనాలు నడుపుకునే డ్రైవర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇక కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందనుకునే లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టి టాటా మ్యాజిక్, ఆటోలు నడుపుకునే డ్రైవర్ల కుటుంబాలను పూటగడవక రోడ్డున పడినట్టుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వాహనాలను నమ్ముకుని కుటుంబాలను మాదిరిగా పోషించుకుంటున్న డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి రానున్న రోజుల్లో మరింత తీసి కట్టుగా మారనుందన్నారు. మహాలక్ష్మి పథకం మా డ్రైవర్ల సంఘం కుటుంబాలపై ఆర్థిక పెను ప్రభావం, భారం చూపుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడంలో మా ఆటో డ్రైవర్ల పాత్ర సైతం ఉందన్నారు. ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల కుటుంబాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రలో వలే తెలంగాణలో టాటా మ్యాజిక్,ఆటో డ్రైవర్లకు నెలనెలా జీతాలు ఇవ్వాలని, వాహనం కిస్తీలు పూర్తి అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, మా పిల్లలకు, కుటుంబాలకు విద్య, వైద్యం ఉచితంగా ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో టాటా మ్యాజిక్ యూనియన్ సంఘం సభ్యులు తాళ్లపల్లి శేఖర్, మొహమ్మద్ ఖుద్రత్, షేక్ అజహార్, బుడిగం యాకన్న కండె కృష్ణ బలగాని శ్రీకాంత్, డి.చిరంజీవి, జి.మహేష్, బి.సాంబయ్య, మొహమ్మద్ రహ్మత్, పడిగ సురేష్ గలిగె శివ పాయం రాజు పడిగ సూర్యప్రకాష్ గలిగె ప్రశాంత్, త్యాగరాజన్ కొలగాని కృష్ణ, కొమరం ప్రభాకర్, నాళ్ల శ్రీను, దొడ్డి సతీష్, వజ్జ కల్యాణ్, సోను, తదితరులు పాల్గొన్నారు.