మహాలక్ష్మి పథకం మా పొట్ట కొట్టే విధంగా ఉంది..ఆటో డ్రైవర్లు ఆవేదన

నవతెలంగాణ-మిరు దొడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం, తమ పొట్ట కొట్టే విధంగా ఉందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రయాణికులు పూర్తిస్థాయిలో బస్సులలో ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు. రోజు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్ల దుస్థితి మరి దయనీయంగా మారిందన్నారు. గత కొద్దిరోజులుగా డీజిల్ కు కూడా డబ్బులు రాలేనటువంటి పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బాలమలు,నాగరాజు, మహెందర్, మహేశ్, హరీశ్, శంకర్ రాజు,కిరణ్ , కుమార్ , బాబు, కిరణ్,తదితరులు పాల్గొన్నారు.