మూడు నెలల జీతాలైనా ఇవ్వండి మహాప్రభో…

Mahaprabho give me three months salary...– ఐదు నెలలుగా జీతాలకు నోచుకోని మిషన్‌ భగీరథ ఆపరేటర్లు
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
ఐదు నెలలుగా జీతాలు లేని మిషన్‌ భగీరథ ఆపరేటర్లు తమకు కనీసం మూడు నెలలు జీతాలైనా ఇవ్వాలని కోరుతున్నారు. అసలే చాలీ చాలని వేతనాలు, అందులో నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోతున్నారు. అపెక్స్‌ ఇన్‌ఫ్రా లింక్‌ ఏజెన్సీ ద్వారా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో మిషన్‌ భగీరథలో సూపర్‌వైజర్లు, పంప్‌, వాల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, లేబర్లుగా ఐదేళ్ల క్రితం 120 మంది నియమితులయ్యారు. ప్రస్తుతం ఐదు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎపుడు అడిగినా రేపిస్తాం, మాపిస్తాం అంటూ ఏజెన్సీ నిర్వాహకులు మాటలు చెపుతూ తమతో పని చేయించుకుంటున్నారే తప్ప వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1, 2 తేదీలలో డివిజన్‌లోని ఏడు మండలాల ఆపరేటర్లు మంచినీటి సరఫరా ఆపి నిరసన వ్యక్తం చేశారు. దీనితో నిర్వాహకులకు ఈ నెల 8వ తేదీన ఒక నెల, 28వ తేదీన రెండో నెల, వచ్చే నెల పదో తేదీన మూడో నెల జీతం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆపరేటర్లు మళ్లీ విధులకు హాజరవుతున్నారు. కాని 8వ తారీఖు గడిచిపోయినా సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. దీనితో మళ్లీ వీరు గురువారం నుండి విధులకు గైర్హాజరవుతున్నారు. తమకు జీతాలు చెల్లించేవరకు తాము విధులకు హాజరు కాబోమని సిబ్బంది జంషీద్‌, శివ, రమేష్‌, సాకీర్‌, ఇర్ఫాన్‌, గోపి, రమణ, రవికుమార్‌, ప్రసాద్‌, నాగేందర్‌, అజహర్‌, ఇక్రం స్పష్టం చేస్తున్నారు.