కమ్మర్ పల్లి, వేల్పూర్ మండలాల్లో గురువారం మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపుమేరకు ఆయా మండలాల్లోని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ ఈ దుష్ట దౌర్జన్య అబద్దాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలిచ్చి గురువారంతో 420 రోజులు పూర్తయిన సందర్భంగా ఎటువంటి హామీలు పూర్తిగా అమలు చేయకపోవడoతో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందించి నిరసన తెలిపామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చిందన్నారు. అధికారులకు వచ్చి నేటితో 420 రోజులైనా ఇంకా హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపుమేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందించి నిరసన వ్యక్తం చేసామన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించి, జ్ఞానోదయం కలిగించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా చూడాలని మహాత్మా గాంధీని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.