తెలుగు సాహిత్యంలో దాశరథిది ప్రత్యేకస్థానం. కవిత్వంలో నిప్పులు చిమ్ముతూ ప్రజాపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న స్థితి ఆ తరంలో మరెవరికీ కనిపించదు. దాశరథి సహజ ఆవేశపరుడు కనుక సాక్షిగా ఉండలేక పోయాడు. తానే చెప్పుకున్నట్లు దాశరథిది ‘బహు ఉద్రేక ప్రకృతి’ నిజం నిరంకుశ రాచరిక దుష్కృత్యాలు చూస్తూ సహించగలడా? ఉద్రేకపడ్డాడు. ఉడుకెత్తాడు. ఆయన తత్వంలో ‘అగ్ని’ కవిత్వంలో ‘అగ్ని. ప్రజాపోరాటంలో అగ్ని. దాశరథి భగ్గుమన్నాడు. ‘నాగీతావళి ఎంత దూరం ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళమ్మున కగ్గివెట్టెదను” అని ప్రకటించుకున్నాడు.
Art is born in struggle’ క్రిస్టఫర్ కాడ్వెల్ మాటలు దాశరథికి సరిగ్గా అన్వయిస్తాయి. ‘పోరాటంలేనిదే కళలేదు. కవితలేదు. నేను ఉద్యమైక జీవిని’ అని చెప్పుకున్నాడు దాశరథి. పోరాటమే తెలంగాణ అస్తిత్వం. పోరాటమే దాశరథి కవిత్వం. ప్రబంధకవికీ ప్రజాకవికీ ఎంత వ్యత్యాసం? తూగుటుయ్యాల మీద ఊగుతూ చెప్పే కవిత్వం ఎక్కడీ జైలు గోడల నడుమ అర్థరాత్రి రజాకార్ల దాడిలో నెత్తురు కక్కుతూ చెప్పే కవిత్వం ఎక్కడీ దాశరథి జైల్లో నెత్తురు కక్కుతూ కవిత్వం చెప్పాడు. ఊహ తెలియగల లేఖక పాటకోత్తములు కాదు గదా, కనీసం కలమూ కాగితమూ లేవు. ఉంటే లాక్కున్నారు జైలు అధికారులు. పళ్లు తోముకోవడానికిచ్చే బొగ్గు. బొగ్గే కలం. జైలు గోడే కాగితం. దాశరథి పద్యం రాశాడు.
”ఓ నిజాము పిశాచమా కానరాడు./ నిన్నుబోలిన రాజు మా కెన్నడేని/ తీగలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రత్నాల వీణ”
పద్యం చెప్పినందుకు ప్రబంధకవికి పసిడి కాసులు. ప్రజాకవికి లాఠీదెబ్బలు. దాశరథికి పడ్డా, ఆళ్వారుస్వామికి పడ్డా అవి దాశరథి పద్యానికి పడ్డ దెబ్బలే. అదీ దాశరథి జీవితం.
—
వరంగల్ జిల్లా చినగూడూరులో 22 జులై 1925 రోజున వేంకటమ్మ, వేంకటాచార్యులు దంపతులకు దాశరథి జన్మించారు. తండ్రి సంస్కృత పండితుడు. ఇంట్లో సంస్కృతంలోనే మాట్లాడాలన్నంత ఛాందసుడు. తల్లి తెలుగు సారస్వత ప్రేమికురాలు. మదర్సా బడుల్లో ఉర్దూ మాధ్యమం నడుమ దాశరథి బాల్యం. కఠిన నియమాల్ని ఎదిరించటం చిన్నప్పుడే అలవర్చుకున్నాడు. కేశవార్య శాస్త్రి నుండి సామాజిక భావనలు సమకూర్చుకున్నాడు. ఖమ్మం హైస్కూల్‌లో ‘జక్కసాబ్’ ద్వారా ఉర్దూ, పారశీక పాఠాల్లో కవిత్వ సౌందర్యాలు అందుకున్నాడు. పాఠశాలలో నిజాం ప్రార్థనా గీతాన్ని ఆలపించడం దాశరథికి నచ్చలేదు. పాడలేదు. అందుకు దెబ్బతిన్నాడు. బాల్యం నుండే దాశరథికి ఇష్టాయిష్టాలు బలంగా వుండేవి. ఉర్దూ ఇష్టం. జక్కీసాబ్ వినిపించి విప్పి చెప్పే గాలిబ్ గీతాలు ఇష్టం. ఇక్బాల్ గీతాలు ఇష్టం. ఇక్బాల్ గీతాల్లో విప్లవాగ్నులిష్టం. మంచినీళ్ల బావికి వచ్చే చుట్టాలమ్మాయి ‘చూడామణి’ ఇష్టం. ఆమె చూపులిష్టం. చుట్టూ గ్రామాల్లో దొరల దురాగతాలపట్ల కోపం. జాగీర్దార్లకు అండగా వుండే నిజాం దౌర్జన్యాల పట్ల కోపం.
దాశరథికి యౌవ్వనంలో కవిత్వమొక మోహం. ప్రియురాలొక మోహం. ప్రజావిప్లవం మరో మోహం. త్రేతాగ్నులుగా చెప్పుకున్నాడు. కేశవార్య శాస్త్రి, జక్కీసాబ్, చూడామణి ముగ్గురూ మూడగ్నులుగా భావించాడు. అంగారం, శృంగారం, దాశరథిని బలంగా ప్రేరేపించిన భావనలు. పొయెట్రీ అన్నా, పబ్లిక్ యాటిట్యూడ్ అన్నా చిన్పప్పట్నుండే దాశరథికి అభిమానం అన్నాడు హీరాలాల్ మోరియా.
ఇంటి కారణాల వల్ల దాశరథి ‘గార్ల’లో గడపవలసి వచ్చింది. తన జీవితంలో అదే పెద్ద మలుపు. తన తిరుగుబాటు ఆలోచనలకు, తీవ్ర కార్యకలాపాలకు గార్ల కేంద్రంగా మారింది.
—
‘గార్ల’ జాగీరు. జాగీర్దారు అధీనంలోని గ్రామాల్లో ప్రజల బాధలు దుర్భరంగా వుండేవి. ఒకవైపు వెట్టిచాకిరి, మరోవైపు రకరకాల పన్నులు. పడీపడని వర్షాలు, పండీ పండని పంటలు, ఎళ్లీఎళ్లని సంసారాలు, బడుగు జీవుల బాధలు దాశరథిని ఉద్వేగపర్చాయి. జాగీర్దార్ల అత్యాచారాలు, వాళ్ల తాబేదార్ల హింసాకాండ, దౌర్జన్యాలు అతని పసిమనసును కలచివేశాయి. ఉడుకు రక్తంతో ఉద్రేక పడుతున్న దాశరథిని కమ్యూనిస్టులు ఆకర్షించారు. గార్ల జాగీరులోని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్ని చైతన్య పర్చేది. 1942 నాటికి కమ్యూనిస్టు పార్టీ సెల్ సమావేశాలు, రహస్య చర్చలు నిర్వహిస్తే దాశరథి హాజరయి చైతన్యం ఆవహింపచేసుకున్నాడు. గిరిజన గూడాల్లో, కోయవాడల్లో తిరిగి చైతన్యపరుస్తూ గటక తిని, నీళ్లు తాగడం అలవాటు చేసుకున్నాడు. ‘ఆంధ్ర మహాసభ’ సమావేశాల్లో ఆంధ్రసారస్వత్ పరిషత్ సభల్లో ఉత్సాహంగా పాల్గొని ఉద్రేకంగా ప్రసంగించేవాడు. కవిత్వం ప్రసారం చేసేవాడు.
1944 ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం ఓరుగల్లుకోటలో. సభలకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడు. భారీ ఏర్పాట్లు, ప్రసంగాలు, కవి సమ్మేళనాలు. వేసిన చలువ పందిళ్లను రజాకార్లు రాత్రికి రాత్రి తగులబెట్టారు. ఉదయం కవులు వెళ్లేసరికి బూడిద, నివురు పొగలు పలకరించాయి. ఇంకెక్కడి కవిసమ్మేళనం? అని నిట్టూర్చారు కొందరు. ఇక్కడే, ఇప్పుడే, ఇట్లాంటి చోటే కవి సమ్మేళనం. నిప్పుల నడుమ నిజమైన కవిసమ్మేళనం అని దాశరథి కవిత అందుకున్నాడు.
”లడేంగే – ఔర్ మరేంగే/ టూటేంగేనహీ – ఘమకేంగే నహీ/ వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికం చేస్తావా?/ దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు/ దిగిపోవోరు – తెగిపోవోరు”
దాశరథి కవన గర్జనలను ప్రతాపరెడ్డి మెచ్చుకున్నాడు. దేవులపల్లి రామానుజరావు పూలమాల వేసి కౌగిలించుకున్నాడు. కవి సమ్మేళనం జరిగిన ఘటన రజాకార్లను భంగపర్చిన చరిత్ర – భయపెట్టిన చరిత్ర.
మానుకోట తాలూకా జయవరంలో మరో సభ జరిగింది. రాత్రి సభలో పాల్గొని ప్రసంగించి తెల్లవారే సమయానికి చినగూడూరు చేరుకున్నాడు దాశరథి. భోజనం చేస్తుండగా తలుపు తట్టి పోలీసులు దాశరథిని అరెస్ట్ చేశారు. చేతులకు బేడీలు వేసి నడుముకు తాడు కట్టి తుపాకులు పట్టిన పోలీసులు నడిపించుకుంటూ ‘నెల్లికుదురు’ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాపలా పోలీసులు తినేసమయంలో తాడు విడిచారు. దాశరథి తప్పించుకున్నాడు. వెంటపడ్డారు పోలీసులు. పశువుల మందనడ్డం చేసుకుంటూ పరుగెత్తి ముప్పై మైళ్ల దూరంలో ‘నాగారం’ గ్రామం చేరుకున్నారు. వేషం మార్చుకుని మళ్లా ఉద్యమం కార్యక్రమాల్లోకి వెళ్లాడు. ‘పులులు చిలుకను బంధించగలవె చెపుమ’ ఉద్వేగ వాక్యం ఎగిసిపడింది.
తరువాత నిఘా ఉంచిన గార్ల పోలీసులు 1947 సెప్పెంబర్‌లో దాశరథిని అరెస్ట్ చేశారు. ఉద్యమకారుల రహస్యాలు చెప్పమని కొరడాలతో కొట్టారు. ‘జిందా దఫ్నా దూంగా, ఖబడ్దార్’ (సజీవంగా పాతిపెట్టిస్తా, జాగ్రత్త) అని గార్ల తాలూక్‌దారు హెచ్చరించాడు. అయినా దాశరథి వెరవలేదు. కేసు పెట్టి వరంగల్ జైలుకు పంపారు. అటునుంచి నిజామాబాద్ జైలుకు తరలించారు. అక్కడ పరిచయమయ్యాడు ఆళ్వారుస్వామి. రోజుకో పద్యం గోడమీద ప్రత్యక్షమయ్యేది. అధికారులు తుడిచివేసినకొద్దీ కొత్త పద్యం, లాఠీ దెబ్బలు పద్యాల్ని ఆపలేకపోయాయి.
నిజామాబాద్‌కు ఇందూరు మరో పేరు. ఇందూరు జైలు నిజానికి జైలు కాదు. అది రఘునాథ దేవాలయం. ఇందుపుర దుర్గం. నిజాం కాలాన జైలుగా అవతరించింది. దాశరథి పద్యం అవతరించింది. ”ఒక కాలమ్మున ఇద్ది దేవళము, వేరొకప్పుడు దుర్గంబు. నేడకటా జైలయికానిపించెను. భవిష్యత్ కాలమునందు ఎట్టి రూపమున్ దాల్చునో” అని ఆవేదన చెందాడు.
1948 జనవరి 11, స్థానిక రజాకార్లు నిజామాబాద్ జైలుమీద దాడి చేశారు. ఎగబడి కర్రలతో కొట్టారు. ఎందరో రాజకీయ ఖైదీలు విపరీతంగా గాయపడ్డారు. ‘కవిగాని సంగతి చూడండి’ అరిచారు. దాశరథికి తీవ్రగాయాలయ్యాయి. ఖైదీలు తేరుకుని రజాకార్ల మీద ఎదురుదాడికి దిగారు. దుర్మార్గులు పరారయ్యారు. తర్వాత దాశరథి, మరికొందరిని చంచల్‌గూడ జైలుకు పంపించారు. ఆళ్వారుస్వామిని నాగపూర్ జైలుకు పంపారు. ఖైదీల్ని విడదీసినా ఉద్యమం మరింత ఉధృతమైంది. దాశరథి కవిత్వం మరింత ఉద్వేగభరితమైంది.
”వేడను దేవుళ్లను, దెయ్యాలను వేడను/ ఓడను రాజుకు, ధనరాజుకు రారాజుకు ఓడనన్నాడు”.
—
స్థానికంగా కమ్యూనిస్టు ఉద్యమం, జాతీయంగా కాంగ్రెస్ ఉద్యమం రెండూ ప్రజా ఉద్యమాలే. కమ్యూనిస్టుల సమసమాజ భావన, కాంగ్రెస్ స్వేచ్ఛాస్వాతంత్య్ర భావన రెండూ దాశరథిని ప్రభావితం చేశాయి. దాశరథి రెండు ఉద్యమాలనూ ప్రేమించాడు. తన కవిత్వంలో రెండు ఉద్వేగాలు బలంగా ప్రతిఫలించాయి. ”అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం/ అనాధుడికీ ఆగర్భ శ్రీమంతుడికీ మధ్య/ సేద్యం చేసే రైతుకు భూమి లేదు పుట్ర లేదు/ రైతుల రక్తం తాగే జమిందార్లకు ఎస్టేట్లు” అన్నప్పుడు ”రానున్నది ఏది నిజం/ అది ఒకటే సోషలిజం” అన్నప్పుడు వ్యక్తమైంది కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తే.
”జెండా ఒక్కటే మూడు వన్నెలది, శాంతికోదండ ఉద్యద్విజయుండు గాంధి ఒకడే” అన్నప్పుడు, ”నీ తుపాకి నిప్పులతో చేతులు కాల్చేసుకోకు, నీళ్లమీద నిప్పులు పడి చల్లబడకపోతాయా?” అని చల్లపర్చినప్పుడు కనిపించేది కాంగ్రెస్ దీప్తే మరి.
తన మిత్రుడు డి.రామలింగం చెప్పినట్లు ‘మనసును వస్త్రం పరిచినట్టు పరుస్తాడు’. మనసే దాశరథి పద్యం. ‘హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు’. అది దాశరథి అభివ్యక్తి. ”దుష్టులతో రాజీ పడలేను. వారితో సామరస్యం చేతకాదు. శాంతిని కోరే క్రమంలో సమరసం కన్నా సమరమే ఇష్టం” అన్న సమయాన సమరమే దాశరథి దారి. అంతలోనే మనసు కుదుటపడుతుంది. ”ఎవడైనా మానవుడే, ఎందుకు ద్వేషించడాలు. రాక్షసినైనా మైత్రికి రానిత్తును” ఆ సమయానా సహనమే. సమరసం వైపే మొగ్గు. గాలిబ్ కవితో, గాంధీ సూక్తో మనసులో మెరుస్తుంది. ”ఏనాడెవ్వడు కత్తితో గెల్వలేదీ విశ్వమున్ ప్రేమ పాశానన్ కట్టుము” అంటాడు. గంజి దొరుకని పేదలు కళ్లముందు కదులుతారు. ప్రాణాలు పణం పెట్టే ప్రజా ఉద్యమకారులు తలపుకొస్తారు. ”ప్రాణం పోయినా కూడ సమ్మె గావింతుమటంచు ఆకట తపించెడి పేదల గూర్చి నేను మోగింతును రుద్రవీణ. పలికింతును విప్లవగీతికావళుల్” అని తన కవిత్వ తత్వాన్ని వ్యక్తం చేస్తాడు.
నిజాం రాచరికం కూలిపోయినప్పుడు అంత పరవశించాడు. ”గెలిచినది గడ్డిపోచ, ఓడినది గొడ్డలి” అని వర్ణించాడు. తెలంగాణ విలీనాన్ని హర్షించాడు. ‘విశాలాంధ్ర’ కోసం పలవరించాడు. ‘మూడుకోటులనొక్కటే ముడిబిగించి కలిసిపోగోరుచున్నదీ తెలుగునేల’ అని కవిత్వీకరించాడు.
విలీనంతోనే ప్రజాసమస్యలు పరిష్కారం కాబోవనే స్పష్టత వుంది. అరమరికలు లేకుండా దాశరథి అంతరంగం ప్రకటించాడు. ”ఇంకా అధర్మం ఉన్నది హిట్లర్‌లు, రావణులు, నిజాములున్నారు. నా పోరాటం ముగియలేదు. ప్రజల పోరాటం ముగియలేదు. నా చేతిలోని కాగడా అందుకొని ఎవరో ఒకరు పురోగమిస్తారు”.
—
ఉర్దూ సాహిత్యానికి వ్యాప్తి తెచ్చిన గజల్, రుబాయీ రూపాలను తెలుగుకు పరిచయం చేశాడు. ఆంగ్లేయులను ధిక్కరించి నానా హింసల పాలయిన ఢిల్లీ చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ భావనల్ని ఆర్థ్రంగా పరిచయం చేశాడు. ”గుండెలో నుండి బాణమ్ము గుంజివేయబోకు ప్రాణాలు దానితో పోవునోయి”, ”ఎవరు కనులు తిప్పి ఈ భూమి తిప్పిరో ధరణి ఆగకుండ తిరుగుచుండె”.
దాశరథికి పద్యం మీద ఎంత పట్టుందో పాటమీద మరింత పట్టుంది. అంతకుమించి ప్రేమ. లలిత గీతాలు, సినిమా గీతాలు తిరుగులేని రుజువులు. ఎనబై వసంతాలు దరిజేరుతున్నా చెక్కుచెదరకుండా ఇప్పటి తరాన్ని కూడా అలరిస్తున్న గీతం – ”ఆ చల్లని సముత్రగర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో” యౌవనోద్వేగంలో దాశరథి సంధించిన ప్రశ్నలు ఈనాటికీ వాడిగా, పదునుగా తాకుతాయి. ‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం, గాయపడిన కవి గుండెలలో రాయబడని వాక్యాలు’ అన్ని కాలాల సందర్భాలకు అద్దం పడతాయి. తలనిండ పూదండ ధరించిన రాణి ఘంటసాల గొంతులో ప్రాణం పోసుకుని నడయాడుతుంది.
ఆధునిక కళారూపాల్లో సినిమా అత్యంత ప్రభావశాలి కళ. దృశ్య, శ్రవ్య, సాహిత్య, సంగీత, నాట్య సమాహార కళ. సినిమా గీతాలు రాయటం కోసం ఆకాశవాణి ఉద్యోగాన్నే వదులుకున్న ఉద్వేగపరుడు దాశరథి. ఆ మోహమే అతి పేదరికానికి దారి తీసింది. ప్రేమగీతాలతో రంజింపచేసినా వ్యథ గీతాలతో మనిషి బాధలు చిత్రించాడు.
దాశరథి పదికి పైగా కథలు రాశాడు. వాటిల్లో ‘నిప్పు పూలు’ ఉత్తమ కథ. తెలుగులో గుర్తింపు పొందిన ఏ గొప్ప కథకూ తీసిపోని కథలు. దాశరథి మరికొన్ని నాటికలు రచించాడు. వాటిల్లో ‘త్యాగజ్వాల’ జాతీయోద్యమాన్ని ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. ఆయన రాసిన నవల ‘మహాశిల్పి జక్కన్న’ దాశరథి వచన రచనల మీద జరగవలసినంత పరిశోధన కానీ, చర్చ గానీ జరగలేదు.
‘యాత్రాస్మృతి’ దాశరథి ఆత్మకథ. ఉద్యమ జీవితాన్ని, కవిత్వ ప్రస్థానాన్ని చిత్రించే దృశ్య కావ్యం. వచనం, కవిత్వం చెట్టపట్టాలు వేసుకుని ఉద్వేగభరితంగా సాగుతాయి. చదువుతుంటే నరాల్లో రక్తం వేడెక్కుతుంది. మహా రచయితే కాదు, దాశరథి క్రియాశీల కార్యకర్త. ఒక సందర్భం ముందుకొచ్చి 1951 – 52 లో తెలంగాణ రచయితల సంఘం నిర్మించారు. తొలి అధ్యక్షుడు దాశరథే. ఊరూరూ తిరిగి కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ సాహిత్య వాతావరణం విస్తరింపజేశాడు. హైదరాబాద్ వైవిధ్యం ప్రతిబింబించేలా బహుభాషా కవి సమ్మేళనాలు; తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ కవుల సందడి. జిల్లాల్లో, పట్టణాల్లో కొత్త రచయితలకు ఊపిరిలూదిన చరిత్ర.
‘ధరకు సురాలయమ్మునకు దారులు వేసెడువాడె సత్కవీశ్వరుడు’. భూమ్మీద స్వర్గం నిర్మించడానికి క్షోభపడ్డాడు దాశరథి. క్షోభ లేకుండా ఏదీ రాయలేదు. క్షోభ తనదీ, ప్రజలదీ. విడదీయలేం. స్వసుఖం కోరుకున్న కవికాదు. ప్రజల సుఖం కోరుకున్న కవి దాశరథి. పిరికివాడు కవి కాలేడని ఆయన భావించాడు. సాహసోపేతంగా ప్రయాణించాడు.
వానగాలికి, వడదెబ్బకు భయపడని ప్రయాణం పేరు దాశరథి. ఆకలికి, అశ్రువులకు వెనుకాడని ధీరత్వం చిరునామా దాశరథి. శతజయంతి సందర్భంగా దాశరథి వినిపించే మహాసందేశం రాగబంధమే. ప్రజానురాగబంధం.
– నందిని సిధారెడ్డి
9440381148