– సభ్యులుగా అనితా రాజేంద్ర, యాదయ్య, పాల్వాయి రజనీకుమారి
– ప్రమాణం చేయించిన గవర్నర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మెన్‌గా మాజీ డీజీపీ పి మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతోపాటు సభ్యులు అనితా రాజేంద్ర, ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, పాల్వాయి రజనీకుమారితో ప్రమాణం చేయించారు. అనంతరం వారు కూడా బాధ్యతలను స్వీకరించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో చైర్మెన్ మహేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌తోపాటు ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీకి కొత్త పాలకమండలి రావడంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతుందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ పదవికి డాక్టర్ బి జనార్ధన్‌రెడ్డి గతనెల 11న, సభ్యులు ఆర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కారం రవీందర్‌రెడ్డి అదేనెల 13న రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. వాటిని ఈనెల 10న గవర్నర్ ఆమోదించారు. ఈనెల 19న మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేశారు. గత ప్రభుత్వం నియమించిన కోట్ల అరుణకుమారి మాత్రమే సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఆమెతో కలిపి టీఎస్‌పీఎస్సీలో ఆరుగురు సభ్యులున్నారు. ఇంకా నలుగురు సభ్యులను నియమించడానికి అవకాశమున్నది. కాగా ఇద్దరు సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, యరబాది రామ్మోహన్‌రావు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నది.