‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకష్ణ(చినబాబు) నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్.తమన సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈనెల 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌లో అభిమానుల కోలాహలం సమక్షంలో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, ‘మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దానికి కారణం త్రివిక్రమ్. మా నిర్మాత చినబాబు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీలీల గురించి చెప్పాలంటే.. చాలారోజుల తర్వాత ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉంది. హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరు. మీనాక్షి మా సినిమాలో ప్రత్యేక పాత్ర చేసింది. అలాగే తమన్ ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తాడు. నాకు, నాన్నకి సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగ కొడతాం’ అని తెలిపారు. ‘ఈరోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం. రమణగాడు మీ వాడు, మనందరి వాడు. అందుకని మీ అందరి మధ్యలో ఈ ఫంక్షన్ చేయాలని అనుకున్నాం. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం. ఆనందంగా జరుపుకుందాం. రమణగాడితో కలిసి జరుపుకుందాం’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు.