హైదరాబాద్ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల చెల్లింపునకు ముందు రూ.69.51 కోట్ల లాభాలను సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తెలిపింది. ఇంతక్రితం ఏడాది రూ.49.56 కోట్ల లాభాలు నమోదు చేసింది. శనివారం హైదరాబాద్‌లోని ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 48వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా బ్యాంక్ ఆర్థిక ఫలితాలను ప్రకటించారు. ఆ వివరాలు..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో 45 శాఖలను కలిగి ఉంది. రూ.398.35 కోట్లుగా ఉన్న సొంత నిధులు..2023-24లో రూ.444.20 కోట్లకు పెరిగాయి. స్థూల ఎన్‌పిఎలు 7.99 శాతం నుంచి 6.04 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పిఎలను శూన్యంగా చూపించింది. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.3,300 కోట్ల వ్యాపారాన్ని చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమావేశంలో ఆ బ్యాంక్ ఎండి, సిఇఒ వి అర్వింద్, ఛైర్మన్ రామ్‌దేవ్ భుటడ, బోర్డు సభ్యులు కిషన్ గోపాల్ మనియర్, ఎస్‌బి కబ్రా, ప్రవీణ్ కుమార్ బహెటి తదితరులు పాల్గొన్నారు.