కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్‌ కుమార్‌, బల్మూరి వెంకట్‌

– ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌
– అద్దంకి దయాకర్‌కు షాక్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ పేర్లను పార్టీ చీఫ్‌ ఖర్గే ఆమోదించినట్టు అందులో పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. మంగళవారం నాడు పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్‌కు ఫోన్‌ చేసి నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. చివరి నిమిషంలో అధిష్టానం ఆయనకు షాక్‌ ఇచ్చింది. కొంత మంది సీనియర్‌ నేతలు, మంత్రులు కూడా అద్దంకికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతు న్నది. కాగా.. గురువారం(18)తో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతున్నది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ వేరు వేరుగా నిర్వహించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రెండు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత వారం రోజులుగా పలువురు ఆశావహులు ఢిల్లీ పెద్దలను కలిసి, లాబీయింగ్‌ కూడా చేశారు. అయితే ఓడిన వారికి, సీనియర్లకు అవకాశం ఉండదని అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. అలాగే పార్టీ కోసం తమ సీటు త్యాగం చేసిన వాళ్లకు, పార్టీని అధికారంలోకి తేవడంలో క్షేత్రస్థాయిలో కృషి చేసిన నేతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ రెండు స్థానాల కోసం దాదాపు 12మందికిపైగా నేతల పేర్లు వినిపించాయి. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీట్లను పార్టీ కోసం త్యాగం చేసిన ముగ్గురి పేర్లు బలంగా వినిపించాయి. ఈ జాబితాలో తుంగతుర్తి సీటు వదులుకున్న అద్దంకి దయాకర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ సీటును త్యాగం చేసిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అలాగే చిన్నారెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. తాజాగా బల్మూరి వెంకట్‌తో పాటు అద్దంకి దయాకర్‌ లను పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించినట్టు తొలుత ప్రచారం కూడా జరిగింది. అయితే చివరికి అద్దంకి దయాకర్‌ స్థానంలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను అధిష్టానం ఖరారు చేసింది. మహేష్‌కుమార్‌గౌడ్‌ సామాజిక సమీకరణాల రీత్యా చాలా సార్లు ఆయనకు అసెంబ్లీ టికెట్‌ దక్కలేదు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీ సంస్థాగత బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా… టీఎస్‌పీఎస్సీ తప్పిదాలు, పేపర్‌ లీకేజీలపై వెంకట్‌ నేతృత్వంలో ఎన్‌ఎస్‌యూఐ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. అలాగే యువతీయువకుల్లోకి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను తీసుకుపోవడంలో వెంకట్‌ విజయవంతమయ్యారు. ఇక హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధిష్టానం అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన ఓటమి చవిచూశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బల్మూరికి పార్టీ టికెట్‌ దక్కలేదు.
పార్టీ నిర్ణయం శిరోధార్యం: అద్దంకి దయాకర్‌
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని భావించిన ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌కు షాక్‌ నిస్తూ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై దయాకర్‌ స్పందించారు. పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకున్నా కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. అధిష్ఠానం తనపై పాజిటీవ్‌గా ఉందన్నారు. మరింత మంచి స్థానాన్ని కట్టబెడుతుందని భావిస్తున్నట్టు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.