మహువా మొయిత్రాను బహిష్కరించాలి

Mahua Moitra should be expelled– ఎంపీగా కొనసాగడానికి అనుమతించొద్దు : 500 పేజీల రిపోర్టుకు 6:4 మెజార్టీతో ఎథిక్స్‌ కమిటీ ఆమోదం
– పక్షపాత ధోరణిలో ప్యానెల్‌ సిఫారసు: ప్రతిపక్ష ఎంపీలు
– నేడు స్పీకర్‌ ఓం బిర్లాకు రిపోర్టు అందజేత
– వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ‘క్యాష్‌ ఫర్‌ క్వెరీ’ వ్యవహారంలో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడనుంది. దీనిపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ.. తాజాగా ఆమెను పార్లమెంట్‌ నుంచి బహిష్కరించే సిఫార్సును ఆమోదించింది. 500 పేజీలతో కూడిన రిపోర్టుకు 6:4 మెజార్టీతో కమిటీ ఆమోదం తెలిపింది. ప్యానెల్‌ సిఫారసు ‘పక్షపాత’ ధోరణిలో ఉందని, ‘తప్పుడు సిఫారసులు” అని నలుగురు ప్రతిపక్ష సభ్యులు అన్నారు.
గురువారం నాడిక్కడ పార్లమెంట్‌ అనెక్స్‌ భవనంలో లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సమావేశం జరిగింది. మహువా మొయిత్రాను బహిష్కరించాలన్న సిఫారసుకు అనుకూలంగా ఆరుగురు సభ్యులు ఓటు వేయగా.. నలుగురు మాత్రం దాన్ని వ్యతిరేకించారు (మొయిత్రాకు మద్దతుగా నిలిచారు). కమిటీలో 15 మంది సభ్యులుండగా, గురువారం సమావేశానికి 10 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారిలో కమిటీ చైర్మెన్‌, బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోంకర్‌, బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, రాజ్‌దీప్‌ రారు, సుమేధనంద్‌ సరస్వతి, హేమంత్‌ గాడ్సే (శివసేన-షిండే), కాంగ్రెస్‌ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ (ఇటీవలి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఆరోపణలపై కాంగ్రెస్‌ బహిష్కరణ), కాంగ్రెస్‌ ఎంపీ వి. వైతిలింగం, సీపీఐ(ఎం) ఎంపీ పి.ఆర్‌ నటరాజన్‌, జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్‌, బిఎస్పీ ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీ హాజరయ్యారు. బీజేపీ ఎంపీలు విష్ణు దత్‌ శర్మ, సునీతా దుగ్గల్‌, సుభాష్‌ భామ్రే, వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేయనుండడంతో తాను హాజరుకాలేనని, సమావేశం తేదీని రీ షెడ్యూల్‌ చేయాలని చైర్మెన్‌ వినోద్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
మొయిత్రాను బహిష్కరించాలని సిఫారసుకు బీజేపీ ఎంపీలు వినోద్‌ కుమార్‌ సోంకర్‌, అపరాజిత సారంగి, రాజ్‌దీప్‌ రారు, సుమేధనంద్‌ సరస్వతి, హేమంత్‌ గాడ్సే (శివసేన-షిండే), కాంగ్రెస్‌ ఎంపి ప్రణీత్‌ కౌర్‌ (ఇటీవలి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఆరోపణలపై కాంగ్రెస్‌ బహిష్కరణ) మద్దతు ఇవ్వగా, కాంగ్రెస్‌ ఎంపీి వి. వైతిలింగం, సీపీఐ(ఎం) ఎంపీ పి.ఆర్‌ నటరాజన్‌, జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్‌, బీఎస్పీ ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీ వ్యతిరేకించారు.
మహువా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, హేయమైనవని, ఆమె నేరానికి పాల్పడిందని ఎథిక్స్‌ ప్యానెల్‌ తెలిపింది. మహువా మొయిత్రాను ఎంపీగా కొనసాగించడానికి అనుమతించకూడదని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎథిక్స్‌ కమిటీ ఆ నివేదికలో సిఫార్సు చేసింది. అంతేకాదు.. మొయిత్రా చర్య (పార్లమెంటరీ లాగిన్‌ వివరాల్ని వ్యాపారవేత్త దర్శన్‌ హిరానందానితో పంచుకోవడం)ను నేరపూరితంగా కమిటీ అభివర్ణించింది. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై చట్టపరమైన, సమగ్రమైన, సంస్థాగత దర్యాప్తుని చేపట్టాలని కూడా కమిటీ సూచించింది. తన పార్లమెంటరీ లాగిన్‌ వివరాల్ని అనధికార వ్యక్తులతో మోయిత్రా పంచుకున్నారని, ఆమె పార్లమెంట్‌ ప్రత్యేక హక్కును ఉల్లంఘించారని ఆరోపించింది. దర్శన్‌ హీరానందానీ నుండి నగదు, సౌకర్యాలు తీసుకున్నారని, ఇది తీవ్రమైన నేరమని కమిటీ పేర్కొంది. ఈ కమిటీ సిఫారసును నేడు (శుక్రవారం) లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పించనున్నారు. ఈ రిపోర్ట్‌ పై వచ్చే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎథిక్స్‌ కమిటీ నివేదికలోని అంశాలు ఆమోదానికి ముందే మీడియాలో రావడంపై మహువా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.
ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి నోట్లు
మహువాపై చర్యలను తప్పుపడుతూ, చైర్మెన్‌ అడిగిన అనైతిక ప్రశ్నలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు అసమ్మతి నోట్లు సమర్పించారు. కాంగ్రెస్‌ ఎంపీ వి. వైతిలింగం, సీపీఐ (ఎం) ఎంపీ పి.ఆర్‌ నటరాజన్‌, జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్‌, బీఎస్పీ ఎంపీ కున్వర్‌ డానిష్‌ వేర్వేరుగా అసమ్మతి నోట్లు అందజేయగా, కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆన్‌లైన్‌లో సమర్పించారు.
ఎంపీని బహిష్కరించే సిఫారుసు ఇదే తొలిసారి
ఒక ఎంపీని బహిష్కరించాలని లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేయడం బహుశా ఇదే తొలిసారి అని లోక్‌సభ రిటైర్డ్‌ సెక్రటేరియట్‌ అధికారి తెలిపారు. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచారి మాట్లాడుతూ ఎంపీని బహిష్కరించాలని లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. 2005లో ”క్యాష్‌ ఫర్‌ క్వరీ” కేసులో 11 మంది ఎంపిలను పార్లమెంట్‌ నుండి బహిష్కరించారు. అయితే ఆ బహిష్కరణలను రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ, లోక్‌సభ విచారణ కమిటీ సిఫార్సు చేశాయన్నారు. లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ నివేదికను ఇప్పుడు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు పంపనున్నట్లు ఆచారి తెలిపారు. దానిని ప్రచురించాల్సిందిగా స్పీకర్‌ ఆదేశించవచ్చని ఆయన అన్నారు.
పార్లమెంటు తదుపరి సమావేశంలో కమిటీ చైర్మన్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత దానిపై చర్చ జరుగుతుందని, ఆ తరువాత సభ్యుని బహిష్కరణకు సంబంధించిన ప్రభుత్వ తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతుందని ఆచారి తెలిపారు.