మెదక్‌లో మైనంపల్లి ఎఫెక్ట్‌..!

Mainampally effect in Medak..!– ఊరూర అనుచరగణం
– మెదక్‌, నర్సాపూర్‌లో పట్టుబిగించేందుకు వ్యూహం
– కాంగ్రెస్‌ నుంచి అసెంబ్లీ బరిలో తండ్రీకొడుకులు
– రెండు టికెట్లకు అధిష్టానం ఓకే..
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో మంతనాలు
– తడాకా చూపిస్తానంటూ హరీశ్‌రావుకు గతంలో సవాల్‌
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సొంత జిల్లాలో పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మెదక్‌ నుంచే మైనంపల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల రీత్యా మల్కాజిగిరిలో రాజకీయంగా స్ధిరపడ్డారు. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన హనుమంతరావు కొడుకు డాక్టర్‌ రోహిత్‌రావును మెదక్‌ వేదికగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ నుంచి మెదక్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో తిరుగుబాటు జెండా ఎగరేసి ‘తన తడాఖా చూపిస్తా’ అంటూ మంత్రి హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి హస్తం గూటికి చేరిన ఆయన.. కొడుకుతో సహా పోటీకి సిద్ధమవుతున్నారు. సొంత జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మైనంపల్లి ఎఫెక్ట్‌ బీఆర్‌ఎస్‌పై ఏ మేరకు ఉంటుందన్న అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రోజుకో మలుపు తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో మైనంపల్లి తండ్రీకొడుకుల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. మైనంపల్లి కుటుంబంలో తండ్రీకొడుకులిద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం కుదరదని కేసీఆర్‌ తేల్చి చెప్పడంతో బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. రెండు టికెట్లు ఇచ్చేట్టు కాంగ్రెస్‌ పెద్దలతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన మెదక్‌ జిల్లాపై దృష్టి సారించారు. హరీశ్‌రావుకు విసిరిన సవాల్‌ మేరకు బీఆర్‌ఎస్‌కు నష్టం చేసేందుకు ఆయన మెదక్‌, నర్సాపూర్‌ రెండు నియోజకవర్గాల్లో పట్టు బిగించాలని చూస్తున్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న మైనంపల్లి కుటుంబం కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్దమైందనే టాక్‌ వినిపిస్తోంది.
మెదక్‌ నుంచి మైనంపల్లి రాజకీయ ప్రస్థానం
మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన మైనంపల్లి హనుమంతారావు తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీలో ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడీపీ మెదక్‌ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రామాయంపేట నియోజకవర్గం నుంచి 2004లో ఆయన సతీమణి మైనంపల్లి వాణి టీడీపీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి మైనంపల్లి వర్సెస్‌ పద్మా దేవేందర్‌రెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం మొదలైంది. ఆ తర్వాత నియోజకవర్గాలు మారడంతో రామాయంపేట రద్దైంది. దీంతో మైనంపల్లి 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మెదక్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2008 నుంచి 2009 వరకు హనుమంతరావు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆయన మెదక్‌ నియోజకవర్గా నికి దూరమై మల్కాజిగిరి కేంద్రంగా రాజకీయాలు చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన 2017 మార్చి 5న ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా రు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి కొడుక్కి మెదక్‌, తనకు మల్కాజిగిరి టికెట్‌ కావాలని పట్టుపట్టినా ప్రయత్నం ఫలించలేదు. దీంతో బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేసి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ గూటిలో చేరి మల్కాజిగిరి నుంచి తండ్రి, మెదక్‌ నుంచి కొడుకు పోటీ చేసేందుకు హస్తం పెద్దల నుంచి హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది. హనుమంతరావు మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ను ఢ కొట్టాలని చూస్తుండగా.. ఆయన్ను చిత్తు చేసేందుకు బీఆర్‌ఎస్‌ సిద్దమవుతోంది.
రెండు నియోజకవర్గాలపై పట్టుకు యత్నం
నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల్లో పట్టుబిగించేందుకు మైనంపల్లి తండ్రీకొడుకులు ప్రయత్నిస్తున్నారు. మెదక్‌ సొంత జిల్లా కావడంతో ఆ రెండు నియోజకవర్గాల్లో ఊరూరా అనుచగణముంది. వారిని యాక్టీవ్‌ చేస్తున్నారు. ఆర్నెళ్లుగా మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మైనంపల్లి ఫౌండేషన్‌ పేరిట ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ అన్ని గ్రామాల్లోనూ అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయాలు, ఇండ్లు, కమ్యూనిటీహాల్స్‌ నిర్మాణం, వైద్య, విద్య అవసరాల కోసం సాయం చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో కలిసొస్తుందని భావిస్తున్నారు. పద్మకు టికెట్‌ ప్రకటించగానే మైనంపల్లి అనుచరులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. దేవేందర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న గంటా తిరుపతిరెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా రోహిత్‌కు ఇస్తారనే ప్రచారం చేసుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బేరసారాలు సాగిస్తున్నారు. పక్కనే ఉన్న నర్సాపూర్‌ నియోజకవర్గంలోనూ పట్టు బిగించాలనుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోచ్చనే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో హనుమంతారావు సంప్రదింపులు జరుపుతున్నారు. సునీతాలక్ష్మారెడ్డికి టికెట్‌ ఓకే కానున్నందున మదన్‌రెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు హనుమంతరావు మదన్‌రెడ్డికి పోన్లు చేసి మాట్లాడుతున్నారు. మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేలా ప్రేరేపించడం, లేదంటే ఆయన అనుచరుల్ని కాంగ్రెస్‌ వైపు తిప్పుకునేలా మైనంపల్లి కుటుంబం పావులు కదుపుతోంది. మరోవైపు మైనంపల్లి తండ్రీకొడుకులిద్దరూ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం ద్వారా బీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థులవుతారని కాంగ్రెస్‌ అధిష్టానం ఆశపడుతోంది. ఈ క్రమంలో హనుమంతరావు తన సొంత జిల్లాలో పట్టు బిగించి హరీశ్‌రావుకు విసిరిన సవాల్‌ను నిలబెట్టుకుంటారో.. లేక ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు ఎత్తులకు చిత్తవుతారో వేచిచూడాలి.
రాహుల్‌ గాంధీని కలిసిన మైనంపల్లి
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటిలో మైనంపల్లి హనుమంత రావుతో సహా ఆయన కొడుకు రోహిత్‌, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నక్కా ప్రభాకర్‌ గౌడ్‌, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ పార్టీ నేతలతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణలో పార్టీ విజయానికి అనుకూల వాతావరణం ఉన్నందున… మరింత ఉత్సాహంతో ముందుకెళ్లాలని సూచించినట్టు తెలిసింది.
కెసి వేణుగోపాల్‌ తో బీసీ నేతల భేటి…
రానున్న ఎన్నికల్లో బీసీలకు పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ బీసీ నేతలు పార్టీ జనరల్‌ సెక్రెటరీ కెసి వేణుగోపాల్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ నియోజక వర్గానికి రెండు చొప్పున… మొత్తం 34 సీట్లు బీసీలకు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేసీ గోపాల్‌.. బీసీలకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.