17న కాంగ్రెస్‌లోకి మైనంపల్లి

Mainampally to Congress on 17th– ఆయన వెళ్లాక మర్రి రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రకటించే అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి నియోజకర్గంలో ఏం జరుగుతోంది..? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు..? సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి దారెటు..? అనే ప్రశ్నలకు మరో వారం రోజుల్లో ఓ క్లారిటీ రానుంది. ఈ నెల 17వ తేదీన సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌ కానుంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ అధిష్టానం రాజశేఖర్‌రెడ్డి పేరును ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ అధిష్టానం ‘మర్రి’ వైపే మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా రాజకీయం మొత్తం మల్కాజిగిరి నియోజకవర్గం చుట్టే తిరుగుతోంది. బీఆర్‌ఎస్‌ అదిష్టానం టికెట్లు కేటాయించటానికి ముందే సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్‌రావుపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం, చర్చ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. మైనంపల్లి వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో దుమారం రేపడంతో ఆయన బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు సంకేతాలు అందాయి. తిరుమల దర్శనం తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న మైనంపల్లి వారం, పది రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పడంతో పార్టీ మారుతున్నాడనే విషయానికి ఊతం ఇచ్చినట్టయింది. దీంతో మల్కాజిగిరి సీటుపై బీఆర్‌ఎస్‌ ఆశావహులు కొందరు కన్నేశారు. బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతూ అధిష్టానం పెద్దల వద్దకు చక్కర్లు కొడుతున్నారు.
‘రాజశేఖర్‌రెడ్డి’వైపే అధిష్టానం మొగ్గు
బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి వైపే బీఆర్‌ఎస్‌ అధిష్టానం మొగ్గు చూపినట్టు సమాచారం. గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉండటం, నియోజకవర్గంలో ప్రచారం చేయడం, దాదాపు నాలుగేండ్లకు పైగా ఏ పదవీ ఆశించకుండా ఉండటం, పదవి లేకపోయినా పార్టీ మారే ఆలోచన చేయకపోవడం లాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానం, ‘మర్రి’నే మల్కాజిగిరి బరిలో నిలిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వారం రోజుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి మనసు మార్చుకుని పార్టీలో ఉండి మల్కాజిగిరి బరిలో నిలుస్తారా..? లేక పార్టీ మారుతారా..? అనే విషయంపై క్లారిటీ వచ్చిన వెంటనే రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. రాజశేఖర్‌రెడ్డి 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అదే సమయంలో మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. కరోనా ముందు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ప్రచారం జరిగినా అవకాశం దక్కలేదు. అనూహ్యంగా ఇప్పుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో రాజశేఖర్‌రెడ్డి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.
రేసులో మరికొందరు..
బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి అసెంబ్లీ సీటు కోసం పోటీ బాగానే ఉంది. మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, అల్వాల్‌ కార్పొరేటర్‌ విజయశాంతి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరందరూ మల్కాజిగిరి సీటు కోసం అధిష్టానం వద్ద అర్జీలు పెట్టినట్టు సమాచారం. మైనంపల్లి వ్యవహారం తేలకముందే తమకే సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తుండటంతో ఒకరిద్దరు నాయకులను మంత్రి కేటీఆర్‌ ఇటీవల సున్నితంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. అన్ని విధాలుగా అలోచించిన బీఆర్‌ఎస్‌ అధిష్టానం మర్రి రాజశేఖర్‌రెడ్డి పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసి చర్చించారు.