– త్వరలో 200 యూనిట్ల వరకు
– ఉచిత కరెంటు కొత్త విద్యుత్ పాలసీ రూపకల్పన
– విద్యుత్ కొనుగోళ్లను సమీక్షించండి : అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ‘గృహజ్యోతి’ పథకం అమలు కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి విద్యుత్ అధికారుల్ని ఆదేశించారు. ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా వంద రోజుల్లోపే ‘గృహజ్యోతి’ని అమల్లోకి తీసుకురావల్సి ఉందనీ, దీనికి సంభందించిన లెక్కాపత్రాల్ని వారం రోజుల్లో పూర్తిచేసి, నివేదిక ఇవ్వాలని చెప్పారు. బుధవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీ శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్‌శాఖపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ స్థితిగతులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. విద్యుత్‌రంగంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని అంశాలు కాకుండా, ఇతర వివరాలు చెప్పాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని కోరారు. గృహజ్యోతిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినందున, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యుత్ పాలసీనే లేకపోవడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దానిపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. కొత్త విద్యుత్ పాలసీ కూడా నివేదికలో పొందుపర్చాలన్నారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభిస్తే, ఆ కంపెనీల నుంచే కరెంటు కొనుగోలు చేయాలని చెప్పారు. గృహజ్యోతి పథకం అమలు కోసం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలనీ, అంతకంటే మెరుగైన ఆలోచనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ రంగంలో విద్యుదుత్పత్తి పెంచడానికీ, మరిన్ని కొత్త ప్లాంట్ల ఏర్పాట్లకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న విద్యుత్‌ప్లాంట్ల పనులను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. అదే సమయంలో విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలు కూడా తీసుకోవాలన్నారు. విద్యుత్‌పై ప్రతి 15 రోజులకు ఒకసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామనీ, అధికారులు దానికి సిద్దంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, టీఎస్ ట్రాన్స్‌కో సీఎమ్‌డీ రిజ్వీ, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ ముషార్రఫ్ ఫారూఖీ, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి. స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.