పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించండి

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించండి– యూకే ఎన్నారై శాఖ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌
రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌ , సలహా సంఘం వైస్‌చైర్మెన్‌ చంద్రశేఖర్‌ సిక్కా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సంఘం యూకే కార్యవర్గ సమావేశం శనివారం లండన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 100 రోజుల కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్‌ సమస్యలు, నీళ్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుచేయకపోవడం పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని నియోజికవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో పార్లమెంటుకు పంపాలని విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియా ప్రభావం అభ్యర్థుల గెలుపులో ఎంతో కీలకంగా మారిందని చెప్పారు. ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే సోషల్‌ మీడియా వేదిక ద్వారా పార్టీకి ఎంతో సేవలందించిన సంగతి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌ కడుదుల, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల, ఎన్నారై బీఆర్‌ఎస్‌ నాయకులు రవి ప్రదీప్‌ పులుసు, అబ్దుల్‌ జాఫర్‌, వెంకట్‌రెడ్డి డొంతుల, సురేష్‌ గోపతి, వీర ప్రవీణ్‌ కుమార్‌, రమేష్‌ ఎసెంపెల్లి, రవి రేతినేని, సత్యపాల్‌ పింగిళి, పథ్వీ రావుల, గణేష్‌ కుప్పలా, మధు యాదవ్‌ ఆబోతు తదితరులు పాల్గొన్నారు.