భువనగిరిలో సీపీఐ(ఎం)ను గెలిపించండి

Make CPI(M) win in Bhuvangiri– నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎండీ.జహంగీర్‌
– కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-భువనగిరి
రాజకీయాల్లో విలువలు దిగజారుతున్న కాలంలో వాటిని కాపాడటానికి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ. జహంగీర్‌ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఎండీ. జహంగీర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో చెరుపల్లి మాట్లాడారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు భువనగిరిలో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని చెప్పారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని తెలిపారు. గతంలో నకిరేకల్‌, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఎర్రజెండా ఉద్యమ పోరాట పటిమ, వాటి ఫలితాలు తెలుసని అన్నారు. నిబద్ధత, నిజాయితీగా పనిచేసే ఎండీ జహంగీర్‌ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎండీ జహంగీర్‌ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి 32 ఏండ్లుగా పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని తెలిపారు. బూర్జువా పార్టీలలో ఉంటూ.. ఎటు అధికారం వస్తే అటువైపు వెళుతున్న నాయకులకు ఈ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. నమ్మిన సిద్ధాంతం.. ఆశయం కోసం పనిచేస్తున్న జహంగీర్‌ను ఆదరించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కులం, మతం, మత విద్వేషాలు రగిల్చడం తప్ప ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు.
ఎండీ.జహంగీర్‌ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు రాజకీయ క్యాంపెయిన్‌ చేస్తామన్నారు. ప్రజా సమస్యను వెలికి తీసి వాటిపై యుద్ధం చేస్తామని, సబ్బండ వర్గాలను కదిలిస్తామని చెప్పారు. నేడు అన్ని ఎన్నికలూ డబ్బులతో కూడుకున్నవని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులకు డబ్బులు ఖర్చు పెట్టే శక్తితోపాటు.. ఆ అవసరం కూడా లేదని తెలిపారు. ప్రజలకు డబ్బులు అలవాటు చేసేది కార్పొరేట్‌ రాజకీయాలేనన్నారు. ఆ డబ్బులను ప్రజలు తిరస్కరించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన దగ్గర డబ్బులు లేవని.. ప్రజల అండదండలే తమకు బలమని అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు భూనిర్వాసితులు, మూసీ సమస్య, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునియాది కాలువ, భీమలింగం ఆసిఫ్‌నగర్‌ కాలువలు పూర్తి చేయాలని సీపీఐ(ఎం) కొట్లాడిందన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఇబ్రహీంపట్నంపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంట్లో గత అభ్యర్థులు ప్రస్తావించలేక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావించి పరిష్కారానికి పాటుపడుతారని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, మంగ నరసింహులు పాల్గొన్నారు.