చిన్నప్పుడు కాలికి కాగితం ముక్కకానీ, పుస్తకం గానీ తగిలితే తీసి కళ్ళకి అద్దుకోవటం అందరికీ గుర్తుండే వుంటుంది. అదిగో అప్పటి నుండి మరేం మాధ్యమాలూ తెలియని మనకు పుస్తకంతో స్నేహం, అనుబంధం ఏర్పడింది. సమాజంలో ఎన్నిరకాల మనుషులు వుంటారో, వాళ్ళతో ఎలా నడుచుకోవాలో, మనల్ని మనం ఏవిధంగా గట్టిపరచుకోవాలో, సామాజిక, కుటుంబిక సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, ఆదర్శాలూ, ఆశయాలూ, ఆశలూ అన్నింటినీ పుస్తకాలు చదివే అర్థం చేసుకున్నాం. ఒక వ్యక్తి చదివే పుస్తకాలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా కట్టొచ్చునంటారు. మా తరంలో స్కూల్‌లో గ్రంథాలయం, అవి చదవడానికి వారానికి ఒక పీరియడ్ ఉండేది. ఇప్పుడు కూడా అన్ని పాఠశాలల్లో పుస్తకాలు చదవటం, వాటిపై చర్చలను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. ఈ నాటి పాఠశాలలో విద్యార్థులను ర్యాంకులవెనుక పరిగెత్తించే సంస్కృతే తప్ప జీవితం విలువను తెలుసుకొనే దిశగా లేవు. ఈరోజు నుండి జరగబోయే పుస్తక ప్రదర్శనకు పిల్లల్ని తీసుకువచ్చి కనీసం తల్లిదండ్రులైనా తమ పిల్లలకి చిన్నప్పటి నుండి మంచి బొమ్మల కథల పుస్తకాలతో నేస్తం కట్టిస్తే తర్వాత్తర్వాత సాహిత్య పుస్తకాలు చదవటానికి అలవాటు పడతారు. పుస్తకా లను మించిన స్నేహితులు ఉండరు. పుస్తకాలతో దోస్తీ కట్టినవారికే సాహిత్యరుచి తెలుస్తుంది.
బ శీలా సుభద్రాదేవి