– జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గట్టు మారెన్న, రాజు
గట్టు: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ సమా వేశాన్ని ఈ నెల 6న (గురువారం ) గద్వాల జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గట్టు మారెన్న, రాజు తెలిపారు. ఆదివారం గట్టు మండల కేంద్రంలోని కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కమిటీలో చర్చించి భవిష్యత్ కార్యచరణకు రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, దళిత బంధు దళితులందరికీ ఇవ్వాలని , స్మశానవాటిక స్థలాలు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని , ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6న జిల్లా కమిటీ సమావేశంలో చర్చించి రూపకల్పన చేస్తామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ హాజరుకానున్నట్లు తెలిపారు . జిల్లాలోని కేవీపీిఎస్ జిల్లా కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గట్టు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం ఆంజనేయులు కర్రెప్ప తదితరులు పాల్గొన్నారు.