దేశ వ్యాప్తం విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి

– విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తున్న మోడీ
– నీట్ స్కామ్ పై  సమగ్ర విచారణ జరిపించాలి
– నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి
– ప్రైవేట్, కార్పోరేట్ ఫీజులను నియంత్రణ చేయాలి
– నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
– విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తున్న తీరుకు నిరసనగా నేడు నిర్వహించే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం జిల్లా కేంద్రం లోని ఎస్ఎఫ్ఐ  జిల్లా ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగిన  విద్యార్థి యువజన సంఘాల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి  శంకర్ పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, విజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిరావత్ వీర నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి తరునోజు సాయి తేజ,మాట్లాడుతూ దేశంలో మోదీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని, పేపర్ లీకులు, స్కామ్ల్, పరీక్షలు రద్దు ద్వారా దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పరువు తీశారని నీట్ పేపర్ లీకైందనే నిజాలను బీహార్ ఎర్పాటు చేసిన సిట్ తెల్చిందని అన్నారు.లీకైనట్లు నిందితులు అంగీకరించిన తర్వాత కూడా కేంద్రం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేవలం గ్రేస్ స్కోర్ కార్డు రద్దు చేసి వారికి పరీక్ష నిర్వహించి దీని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నీట్ పరీక్ష తో పాటు నెట్, నెట్ సిఐఎస్సిఆర్ పరీక్షలు రద్దుచేశారంటేనే విద్యా విధానం పట్ల చిత్తశుద్ధి అర్ధం అవుతోంది అని అన్నారు. దేశంలో నూతన విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలల మూసివేతను నిరసనగా కెజీ నుండి పిజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా నీట్ లీకేజీ వల్ల విద్యార్థులు ర్యాంకులు మారి గందరగోళం ఏర్పడిందని, అత్యున్నత వైద్య విద్య అమ్మకానికి పెట్టారని విమర్శించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని,  దేశ ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా ప్రైవేట్, కార్పోరేట్ ఫీజులు దందా నియంత్రణ చేయాలని, విద్యాసంస్థల బంద్ జయప్రదం చేసి సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్యు జిల్లా నాయకులు సోహెల్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు బివి చారి, పిడిఎస్యు జిల్లా నాయకులు, ఎన్ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బి. ప్రసాద్, ఎన్ ఎస్ యు ఐ నల్గొండ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగార్జున,  వి జె ఎస్ జిల్లా అధ్యక్షులు పగిళ్ల ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గ్యాదపక  సూర్య తేజ, తదితరులు పాల్గొన్నారు.