”ఏ విషయాలనైతే మనం నిజం కావాలనుకుంటున్నామో ఆ విషయాల్ని నమ్మేముందు మనం కొంత జాగరూకతతో ఉండాలి! నిన్ను నువ్వు మోసం చేసుకున్నంతగా వేరెవరూ నిన్ను మోసం చేయలేరు”
– నొబెల్ గ్రహీత, అమెరికా భౌతికశాస్త్రవేత్త, రిచర్డ్ ఫేన్‌మన్
భారతదేశంలో బౌద్ధసంస్కృతి ఉందని తవ్వకాల చరిత్ర చెపుతుంది. తవ్వకాల ద్వారా భూగర్భంలో లెక్కలేనన్ని ఆధారాలు దొరికాయి. కానీ, బ్రాహ్మణ వైదిక సంస్కృతి, చరిత్రా ఇప్పటివరకు ఏ తవ్వకాల్లో బయట పడిందీ? బుద్దుడి ఆనవాళ్లు లెకలేనన్ని దొరికాయి. దొరుకుతున్నాయి. ఇతర వైదిక దేవీదేవతల ఆనవాళ్లు ఎక్కడ దొరికాయీ? కల్పిత కథల్ని వాస్తవాలతో ఎందుకు ముడిపెడతారూ? ‘దీక్ష’- బౌద్ధ అంతర్జాతీయ నెట్‌వర్క్ అందించిన సమాచారం ప్రకారం, బుద్ధుణ్ణి ‘సమ్మ-శంబుద్ధ’ అని పిలుచుకుంటారు. ఈ సమ్మ శంబుద్ధ నుండే శంభూనాథ్ అనే పేరు ఏర్పడింది. ఆ రకంగా శంభూనాథ్ అన్నా, శంభూ మహదేవ్ అన్నా అవి బుద్ధుని పేర్లే. హర్ హర్ మహాదేవ్ – అంటే అర్హత్ మహాముని బుద్ధుడు. ”శమభో మతాలబ్ శివహే/ బాలకీ శంభో మతాలబ్ / సమ్మ సమ బుద్ధా తథా గత బుద్దే!” – మూసుకుని ఉన్న బుద్ధుడి కళ్లకు (శిల్పానికి) తెల్లగా పెయింట్ కొట్టి, కృత్రిమంగా నల్లరంగుతో కళ్లు దిద్ది- లేదా బుద్దుడి శిల్పానికే గుంగురు వెంట్రుకల వెనుక విరబోసుకున్న జుట్టు అమర్చి, ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం వెనక త్రిశూలం పెట్టి, దాన్ని శివుడి విగ్రహంగా మార్చి, పూజల పేరుతో వ్యాపారం చేయడం భావ్యమా? బుద్ధుడి త్రిశరణాలకు సంబంధించి బౌద్ధంలో ఒక సంకేతం- (గుర్తు)ఉంది. దాన్ని కొంచెం పెద్దగా చేసి త్రిశూలం చేయడం. ఆత్రిశరణాల గుర్తునే ఒకవైపు తిప్పి, దాన్నే వైదిక మతస్తులు ‘ఓం’ గుర్తుగా మార్చుకోవడం న్యాయమా?
భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతులు నాగులు. నాగులు అంటే నాగుపాములు అని కాదు. అది ఒక తెగ. దేశంలో చాలాచోట్ల ఆ తెగ వ్యాపించి ఉండేది. నాగులను జయించలేని ఆర్యులు, నాగులతో సఖ్యత పాటించి, సంధి చేసుకున్నారు. ఆర్యేతరులైన ఈ నాగుల కాలంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారని తెలుస్తూ ఉంది. నాగులకు ఆద్యుడు శిశునాగుడు. సాధారణ శకానికి ముందు 642 దీజజులో మగధలో ఈ నాగరాజ్యం ఉండేదని తెలుస్తూ ఉంది. ఈ విషయం అంబేద్కర్ తన రచనలో ఒకచోట ప్రస్తావించారు. బుద్ధుడు ధ్యానముద్రలో ఉండగా, నాగుపాము వచ్చి, పడగవిప్పి నీడనిచ్చినట్లు కొన్ని శిల్పాలు, చిత్రపటాలు కనిపిస్తాయి. అలాంటివి వైదిక మత ప్రభావంతో చిత్రించబడ్డవి లేదా శిల్పాలుగా చెక్కబడ్డవి. నిజానికి నాగవంశం వారు బౌద్ధులు! బుద్ధుడికి అనుయా యులుగా ఉన్నారు. ఆయనకు రక్షణగా ఉన్నారు అని చెప్పడానికి ఒక సంకేతంగా అలా చెక్కారు. అంతే! నాగుల జనాభా అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలన్నీ వారి నాగ పేరుతో ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు నాగ్ పూర్, దాని దగ్గరలో నాగ్‌నది వగైరా… బుద్ధుణ్ణి అవతారాల్లో చేర్చుకునేందుకు వైదిక మతస్తులు పన్నిన కుట్రలో భాగంగా నాగుపాము పడగవిప్పి బుద్ధుడికి నీడనిచ్చినట్లు చెక్కుకున్నారు. బౌద్ధంమీద వైదిక మతస్తుల ప్రభావం అధికం కావడంతో బౌద్ధంలో వజ్రయానం ప్రారంభమైంది. వైదిక మతంలో ఉన్నవన్నీ వజ్రయానంలో ఉన్నాయి.
అశోకచక్రవర్తి తన రాజ్యంలోని గ్రామాల్లో, పట్టణాల్లో 84వేల బౌద్ధస్థూపాలు, విహారాలు, సంఘారామాలు, విద్యాలయాలు, చికిత్సాలయాలు కట్టించాడు. ఆవి మూడేళ్లలో పూర్తయ్యాయి. వాటన్నిటినీ కార్తీక అమావాస్య రోజు దీపదానోత్సవం రోజు ఒకేసారి ప్రారంభింపజేశాడు. అంతేకాదు, మనువాదుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచిన బుద్ధుడి అనుచరుడు మౌద్గాల్బన్ స్మృతిలో కూడా కార్తీక అమావాస్యరోజే దీపాలు వెలిగించి నివాళులు అర్పించాలని అశోకుడు ప్రకటించాడు. వీటితో పాటు మొదటిసారి పశువులకు చికిత్సాలయాలు, రహదారుల వెంట మంచినీటి సౌకర్యం- అశోకుడే ప్రారంభించాడు. మనుషుల గురించే కాదు, పశుపక్ష్యాదుల గురించి ఆలోచించా లన్నది బౌద్ధం చెప్పింది.దాన్ని అశోకుడు పూర్తిగా పాటిస్తూ, మనుషులకు, పశువులకు విడివిడిగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాడు. అలాగే విడివిడిగా చికిత్సాలయాలు ఏర్పాటు చేశాడు. ఇది గమనించాల్సిన విషయం!
బౌద్ధపర్వదినాల్లో ‘ఉపాసథ’ ముఖ్యమైంది. అమావాస్య – పౌర్ణమినాడు అంటే, పదిహేను రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించుకునే రోజులను ‘ఉపోసథ’ రోజులు అంటారు. బుద్ధుడు భిక్షులతో కలిసి వచ్చిన సందర్భాల్లో ఇంటింటా దీపాలు వెలిగించి ఆహ్వానం పలికే విధానం సంప్రదాయంగా సాగింది. ధర్మోపన్యాసాలు, దాన కార్యక్రమాలు జరిపే ప్రదేశాలను దీపాలతో నింపేవారు. స్థూపాలన్నీ దీపాల దిబ్బలుగా, దీపాల కొండలుగా కని పించేవి. అందుకే వీటిని ‘దీపాల దిన్నెలు’ అని అనేవారు. దీపావళి బౌద్ధుల పండగ. దీపావళి మరుసటి రోజు గోవర్ధన్ పూజ చేస్తారు. వైశాలిలోని బౌద్ధ స్థూపం వంటిది చిన్నస్థూపం పెద్ద పళ్లెంలో తయారు చేసి, దానికి పూజ చేస్తారు. అదే గోవర్ధన్ పూజ! ప్రతి ఒక్కరూ బీహార్‌లోని ప్రసిద్ధ వైశాలి స్థూపం వెళ్లి పూజించుకోలేరు కాబట్టి, వారి వారి ఇళ్లలోనే చిన్నచిన్న స్థూపాలు తయారు చేసుకుని, పూలతో అలంకరించి బుద్ధుణ్ణి తలచుకుంటారు. అదే గోవర్ధన్ పూజ. ఉత్తర భారతదేశంలో ఇది ఒక ఆచారంగా పాటిస్తున్నారే గాని, దాని వెనకఉన్న బౌద్ధమూలాల్ని మరిచి పోయారు. పూర్వీకులు చేశారు, మనమూ దాన్ని కొనసాగిద్దాం – అనే తప్ప, అసలు ఎందుకు చేస్తున్నాం? ఏ విలువల్ని కాపాడడానికి చేస్తున్నాం అనేది జనం ఆలోచించడం లేదు
బౌద్ధులు మరణాన్ని నిర్వాణం అంటారు. ‘నిర్వాణం’ అంటే దీపం ఆరిపోవడం. ప్రమిదలోని నూనె, వత్తి పూర్తిగా మండిన తర్వాత ఇక ఆ దీపం ఆరిపోతుంది. అదే నూనె, అదే వత్తి ఇక ఉండవు. వీటితో మళ్లీ దీపం వెలిగించలేం. మనిషి నిర్వాణం తర్వాత కూడా అంతే! ఇలా అనిత్యత్వాన్ని, అనాత్మవాదాన్నీ దీపంతో పోల్చి చెపుతుంది బౌద్ధం. ఒక రకంగా పునర్జన్మ ఉండదు అని ఈ దీపంతో బౌద్ధం స్పష్టంగా వివరించింది. మరణించిన వారి తల దగ్గర దీపం ఉంచే సంప్రదాయం ఈ నిర్వాణం నుండి వచ్చిందే. అందుకే మరణాన్ని దీపం ఆరిపోడంతో పోలుస్తారు. ”నీ దీపం ఆరిపోను” అనే మాట ఇప్పటికీ వాడుకలో ఉంది కదా? నమస్తే, నమస్కారం – అనే మాటలూ పాలిభాష నుండీ వచ్చాయి. సంస్కృతం నుండి కాదు. డా.బి.ఆర్. అంబేద్కర్ పాలి – ఇంగ్లీషు డిక్షనరీ తయారు చేశారు. ఆయన రచనల్లో సంపుటి 16. పేజి. నెం. 217లో ఈ విషయం చూడొచ్చు.నమస్సా-నమస్సి-నమతి – అనే పాలి భాషా పదాల నుండి మనం ఇప్పటి నమస్కారం, నమస్తే-నమస్కార్ వంటి మాటలు తీసుకున్నాం. నమస్తి – అంటే TO PAY ATTENTION/ TO HONOUR/TO WORSHIP. ఇప్పటికీ మన నిత్యజీవితంలో వాడుతున్న మాటలు, కొనసాగిస్తున్న పద్ధతులు బౌద్ధం నుండి తీసుకున్నవే! సనాతన ధర్మమంటే ఏమిటో, ఏదో తెలుసుకుండా మూర్ఖంగా కట్టుకథల సంస్కృతి గురించి గొప్పలు చెప్పుకుంటున్నది నిజం కాదా? బౌద్ధ సంప్రదాయం నుండి తీసుకున్న విషయాలు ఇప్పటికీ మన జీవితంలో ఎందుకున్నాయీ? ఆలోచించాలి కదా?
ప్రపంచంలో ఒకానొక కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగేవి. చావుల్ని, రక్తపాతాల్ని తగ్గించడానికి ఇరుపక్షాల నుండి యుద్ధం చేయడానికి ఒక్కొక్కర్ని ఎన్నుకునేవారు. అందులో ఏ పక్షం వాడు గెలిస్తే, ఆ పక్షానిదే విజయం అనే ఒప్పందం ఉండేది. దానితో ఇరుపక్షాల సైన్యంలో మరణాలు తగ్గేవి. అప్పటి నుండే మల్లయుద్ధాలకు, గదా యుద్ధాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ విధంగా ప్రపంచమంతా యుద్ధాలతో, జయా పజయాలతో సతమతమౌతున్న సమయంలో గౌతమబుద్ధుడు మరొక రకమైన యుద్ధానికి తెరలేపాడు. అది అస్త్రశస్త్రాలతో చేసేది కాదు. శారీరకంగా చేసేది కూడా కాదు. బుద్ధిని ఉపయోగించి చేసేది. శాస్త్రాలతో చేసేది. తర్కబద్ధంగా వాదిస్తూ ప్రతివాదిని ఓడించడం. అది జ్ఞానయుద్ధం! జంబూ ద్వీపంలోనే కాదు, మొత్తం విశ్వవ్యాప్తంగా అభిప్రాయాలున్నంత మాత్రాన యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోవల్సిన అవసరం లేదనీ, వైరం వైరాన్ని పెంచు తుందేగాని శాంతిస్థాపన చేయదనీ ఆయన ప్రచారం చేశాడు. వివేచనతో, వివేకంతో శాంతిస్థాపన జరుగుతుందని అదే సనాతన ధర్మమని ఆయన చెప్పగలిగాడు (యమక వగ్గే 5 : ధమ్మపథం)
బుద్ధుడి ఆలోచనా విధానంతో ప్రభావితులై ఎంతోమంది తత్త్వవేత్తలు, మేధావులు తయారయ్యారు. కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలుసు కున్నారు. చర్చలు జ్ఞానాన్ని పెంచాలే గానీ, మనస్పర్థలు పెంచగూడదన్న నిర్ణయీనికి వచ్చారు. ఈ అవగాహన ఫలితంగానే బౌద్ధులు ప్రపంచస్థాయి ప్రమాణాలుగల విశ్వ విద్యాలయాల్ని నెలకొల్పగలిగారు. అప్పుడే ఈ భారతదేశం ‘విశ్వగురువు’ స్థాయికి ఎదిగింది. ఎదిగి కూడా శతాబ్దాలు గడిచిపోయాయి. అవన్నీ నాశనం చేస్తూ వచ్చిన మూర్ఖ మనువాదులు ఇప్పుడు దేశాన్ని తామే విశ్వగురువుగా నిలబెడతామని ప్రగల్బాలు పలుకుతున్నారు. జాతుల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య అంతరాలు సష్టించి, విద్వేషాలు రెచ్చగొట్టి- అణిచివేతకు, అఘాయిత్యాలకు, హత్యలకు, అత్యాచారాలకు, అవినీతికి ప్రాధాన్యతనిస్తున్న నేటి ఈ పాలకుల్ని చూస్తే ఏమనిపిస్తుంది? మనమేం కోల్పోయామో, ఏస్థాయి నుంచి ఏస్థాయికి దిగజారిపోయామో తెలుస్తుంది. మనం దేన్ని కాపాడుకోవాల్సి ఉందో, దేన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉందో- తేల్చుకోవాల్సి ఉంది. హ్యూన్ త్సాంగ్, ఇత్సింగ్ నోట్స్ వల్ల దేవభిక్షు అశ్వఘోష్, నాగార్జునుల గురించి, వారి బోధనల గురించి విస్తృతంగా తెలి సింది. తాత్విక విషయాల్లో వీరితో ఢీకొట్టగలవాడు తమకు ఒక శంకరాచార్య ఉన్నాడన్న ఆర్యబ్రాహ్మణులు, తర్వాత కాలంలో తోకముడిచారు. ఎందుకంటే, శంకరాచార్యను జనం ప్రచ్ఛన్న బుద్ధుడన్నారు. ఇకనేం జ్ఞానంతో పోటీపడలేక మోసపూరితంగా బౌద్ధారామాల్ని శివాలయాలుగా మార్పించే ప్రయత్నంలో పడిపోయాడు- శంకరా చార్య! ఏమైనా, ఆయన ప్రచ్చన్న బుద్ధుడన్న పేరు తగిలించుకోక తప్పలేదు !!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
– డాక్టర్ దేవరాజు మహారాజు