ఎక్వేరియంపై రేతి కుమారికి చిన్నప్పటి నుంచి అమితమైన అభిరుచి ఉండేది. ఆ అభిరుచే ఆమెను ఎక్వేరియం చేపల వ్యాపార వేత్తగా మార్చింది. విజయం దిశగా ప్రయాణించేలా చేసింది. ఆ వ్యాపారం ద్వారా ఇంటి నుంచే ఇప్పుడు ఆమె నెలకు రూ.50వేల వరకూ సంపాదిస్తున్నది. ఈ రంగానికి ఆమె చేసిన విశేషమైన సహకారానికి గాను.. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ), సహా పలు సంస్థల నుంచి గుర్తింపు పొందింది. టీచర్ నుంచి వ్యాపారవేత్తగా మారిన ఆమె ప్రయాణం నేటి మానవిలో…
కేరళలోని అలప్పుజ జిల్లాలోని ఒనాట్టుకరకు చెందిన రేతి కుమారి.. కెమిస్ట్రీ టీచర్. 15 ఏండ్లపాటు అధ్యాపక వృత్తిని కొనసాగించింది. కుటుంబ బాధ్యతల కారణంగా 2017లో ఉద్యోగాన్ని వదలాల్సి వచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉండటం నచ్చక తన చిన్ననాటి కలను నిజం చేసుకోవాలనుకుంది. తన చిరకాల అభిరుచి ఎక్వేరియంపై దృష్టి పెట్టింది.
పెద్ద మార్పు
చిన్న గాజు బౌల్‌లో.. గప్పీ చేపలతో మొదలైన ఆమె ప్రయాణం.. 2019 నాటికి పూర్తి స్థాయి వృత్తిగా మార్చుకుంది. చిన్న ఫ్రీజ్ బాక్స్‌ల నుంచి ప్రత్యేక చేపల ట్యాంక్‌కు మారింది. చేపల పెంపకం విస్తరించడంతో, ఇరుగుపొరుగువారు ఆమె వద్ద చేపలను కొనుక్కోవటం ప్రారంభించారు. ఆమెకు వృత్తిగా మారటానికి ఇదే పునాది. ‘తొలుత.. నేను రెండు జాతుల చేపలతో మాత్రమే అక్వేరియం ప్రారంభించాను. ఇప్పుడు నా దగ్గర ఐదు జాతులు… గుప్పీ ఫిష్, ఏంజెల్‌ఫిష్, సిచ్లిడ్, సియామీస్ ఫైటింగ్ ఫిష్, కోయికార్ప్ ఫిష్ ఉన్నాయి. మొదట్లో వీటి పెంపకం సవాలుగానే ఉండేది. శిక్షణ తీసుకోవటం, పట్టువదలకుండా ప్రయత్నం చేయటంవల్లే ఇది సాధ్యమైంది’ అని రేతి గుర్తుచేసుకున్నారు.
శిక్షణ ఇలా..
2022లో, కేరళ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (కేఐఈడీ)లో 10 రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సంవత్సరం.. ఆక్వాకల్చర్, ఫిషరీస్ సెక్టార్‌లో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎఫ్‌డీబీ-హైదరాబాద్) స్పాన్సర్ చేసిన శిక్షణా కార్యక్రమానికీ ఆమె హాజరయ్యారు. పది రోజులపాటు శిక్షణ పొందారు. అక్కడ చేపల పెంపకంలో పద్ధతులు, మార్కెటింగ్ గురించి మరింత తెలుసుకునే అవకాశం లభించింది. అంతేకాదు ఎక్వేరియం నిర్వహణలో మరింత నాలెడ్జ్ సంపాదించారు. దాంతో ఆమెకు విశ్వాసం, ఆసక్తి మరింత పెరిగింది.
ప్రభుత్వ మద్దతు… ప్రాజెక్ట్ విస్తరణ
2022, 2023 మధ్య, కేరళ ప్రభుత్వం చేపట్టిన మీడియం స్కేల్ ఆర్నమెంటల్ ఫిష్ పెంపకం యూనిట్ (మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫిష్) అనే ప్రాజెక్ట్‌ను రేతి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం రేతి రూ.8 లక్షలు రుణం తీసుకున్నారు. తరువాత.. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద తన ప్రాజెక్ట్ కోసం 60 శాతం సబ్సిడీని పొందారు.
మత్స్య పారిశ్రామికవేత్తగా..
2024లో సీఎంఎఫ్‌ఆర్‌ఐ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేతి అత్యుత్తమ మత్స్య పారిశ్రామికవేత్తగా సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని అందుకున్నారు. అదే ఏడాదిలో ఉత్తమ ఎక్వేరియం చేపల పారిశ్రామికవేత్తగా ముత్తుకులం బ్లాక్ పంచాయతీ ఆమెను సత్కరించింది. ప్రస్తుతం, ఆమె 50,000 లీటర్ల ట్యాంక్‌ను నిర్వహిస్తున్నారు. ఇది ఆమె ఎదుగుదల, అంకితభావానికి నిదర్శనం. స్థానిక పరిశోధనల ఆధారంగా తాను చేపల జాతులను ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. వ్యాధుల బారినపడని, వాతావరణ ఒత్తిడికి తట్టుకోగల వాటిని ఎంపిక చేసుకుంటున్నానని చెప్పారు.
అధునాతన సాంకేతికత, మార్కెట్ వ్యూహం
తన మొదటి జాతి చేపలకు ‘డియర్ గప్పీ’ అని పేరు పెట్టారు. నీటి రీసైక్లింగ్ కోసం ఆధునిక సాంకేతికతగల బయోఫిల్టర్‌లను వాడుతున్నారు. రిటైల్ కంటే టోకు అమ్మకాలపై ఎక్కువ దృష్టి పెడుతు న్నారు. ఆమె ఒకేసారి 5,000 నుంచి 10,000 చేపల వరకూ విక్రయించే స్థాయికి ఎదిగారు. కొరియర్ సేవలనూ అందిస్తు న్నారు. ఒక్క కేరళలోనే కాదు.. కర్నాటక వరకూ చేపల డెలివరీని చేస్తున్నారు. ఈ ఎక్వేరియం చేపల అమ్మకం ద్వారా ఏడాదికి రూ.ఆరు లక్షల వరకూ ఆర్జిస్తున్నారు.
ఔత్సాహికులకు సలహా
సాంకేతికత వినియోగంపై సరైన శిక్షణ పొందడం, నీటి నాణ్యతను పర్యవేక్షించడం, ఎక్వేరియంను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలనీ, వ్యాధుల బారినపడిన చేపలను వెంటనే తొలగించాలనీ, ఎక్వేరియం నిర్వహణకు ఈ పద్ధతులు అవసరమని ఆమె సలహా ఇస్తున్నారు.
కెమిస్ట్రీ టీచర్‌గా మొదలై… ఇప్పుడు ఎక్వేరియం చేపల పెంపకందారుగా రేతి కుమారి ప్రయాణం విజయవంతంగా సాగుతున్నది. అభిరుచిని వ్యాపారంగా మార్చుకుని విజయ పరంపర కొనసాగిస్తున్న ఆమె ప్రయాణం ఆదర్శనీయం. కలలను సాకారం చేసుకోవటానికి… అనుకున్న పనిలో ఎన్ని సవాళ్లు ఎదురైనా.. సంకల్పంతో కొనసాగిస్తే విజయం వరిస్తుందనటానికి ఆమె ప్రయాణం ప్రేరణగా నిలుస్తున్నది.