క్లాస్‌ లీడర్‌ – గేలిచేయడం

Class Leader - Teasingప్రతీ స్కూల్లో, తరగతిలో ‘క్లాస్‌ లీడర్‌’ లేదా ‘మానిటర్‌’ వుంటారు. టీచర్‌ క్లాస్‌కి రాని సమయంలో, బయటికి వెళ్లిన సమయంలో తరగతిని నియంత్రించే బాధ్యత ఈ లీడర్‌ తీసుకుంటారు. సాధారణంగా క్లాస్‌లో బాగా చదివే విద్యార్ధినీ విద్యార్ధులే ఈ పదవినీ, బాధ్యతనీ స్వీకరిస్తుంటారు. అలాగే టీచర్‌ వీరాభిమానిగా వుండేవారు కూడా ఈ బాధ్యతల్ని చేపడుతుంటారు. అందువల్ల కొంత అధికార దర్పం చాలా చిత్రంగా ప్రదర్శిస్తుంటారు.

పెద్ద తరగతుల్లో అయితే ఏకంగా ఈ లీడర్లు ఇతర పిల్లల్ని ఆటపట్టి స్తుంటారు. ఏడిపిస్తారు. టీచర్‌ ఇచ్చిన అధికారాన్ని ఆ సమయంలో పూర్తిగా అలా వినియోగించుకుంటారు. గతంలో ఇతరుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ఆ సమయంలో పనిగట్టుకుని బదులు తీర్చుకుంటూ వుంటారు. అది సరదా కాదు. చాలా సీరియస్‌గానే చేస్తారు. ఇదే ప్రమాదకరం. ప్రతీ తరగతిలో ఒకరిద్దరు కాస్తంత మెతక విద్యార్థులు, విద్యార్థినులు ఉంటారు. అలాంటివారే ఈ తరహా లీడర్లకు చిక్కుతారు.
అందరిలో హేళన చేయడంతో ఆ విద్యార్థులు మనస్తాపం చెందే అవకాశాలే ఎక్కువ. అలాంటపుడు టీచర్లకు, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలి. గోలను, హేళనను కొంతవరకే ఎవరైనా సహించగలరు. కనుక టీచర్లు కూడా అలాంటివారి మీద చర్యలు తీసుకుంటారు. క్లాసులో, స్కూలు ఆవరణలో సరదా స్థాయి మించకూడదు. చిత్రమేమంటే ఈ లీడర్లు కూడా చిన్నపాటి లంచాలు తీసుకుంటుంటారు! పెన్‌, పెన్సిల్‌, జామెట్రీబాక్స్‌, టిఫిన్‌ బాక్స్‌లో వాటా.. ఇలాంటివి. అవి ఇచ్చినవారికి ఎంతో మంచి చేస్తారు. ఇవ్వనివారికి వాళ్ల స్థాయిలో శిక్షలూ వేస్తుంటారు.
పొట్టిగా వున్నారనో, సన్నగా వున్నారనో, మాట్లాడటం సరిగా రాదనో, పిరికిగా భయం భయంగా వున్నారనో హేళనచేయడం, ఏడిపించడం జరుగుతుంటుంది. దాన్ని గురించి పట్టించుకుంటే మానసిక వొత్తిడి మరీ ఎక్కువవుతుంది. అలా హేళన జరుగుతుంటే తల్లిదండ్రులకు లేదా టీచర్లకు వెంటనే ఫిర్యాదు చేయాలి. కానీ అంతకు ముందు అసలు అలా హేళన చేయడంలో కారణాలు మీరంతట మీరే గ్రహించుకోవాలి. మీలోనే పొరపాట్లు ఉంటే వాటి నుంచి బయటపడే మార్గాన్వేషణ చేయండి. తల్లిదండ్రులతో మాట్లాడండి. అవేవీ కానపుడు ఫిర్యాదుచేయండి. గతంలో నా విద్యార్ధిని అలానే చేసింది. తను లావుగా వుందని క్లాసులో అల్లరిపట్టించేవారు. లావు తగ్గాలనుకుంది. అందుకు ఎంతో కషిచేసి ఆ సమస్య నుంచి బయటపడింది. ఇపుడు ఆమెకు అందరూ స్నేహితులయ్యారు. కానీ ఆమె ఎవ్వరిమీదా ఫిర్యాదునీయలేదు.
తల్లిదండ్రులు తమ పిల్లల్నించి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయరాదు.
రెండుమూడుసార్లు మించి ఫిర్యాదులు వస్తుంటే అది వాస్తవమనే గ్రహించాలి. అప్పుడు టీచర్తో సంప్రదించి ఆ లీడర్‌ లేదా మానిటర్‌పై చర్యలు తీసుకునేలా చేయాలి. మరీ ఎక్కువైతే ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేయాలి. లేదంటే వేధింపులు ఎక్కువయి, ఇతర విద్యార్థినీ విద్యార్థులు కూడా అదే పని చేయడానికి పూనుకుంటారు. ఇది మరీ ప్రమాదకరం. పిల్లలకు చదువుమీద, తిండి మీదా ఆసక్తి పోతుంది. ఆ స్థానంలో అసలు బడి, తరగతి గది అంటేనే భయం పట్టుకుంటుంది. బెరుగ్గా తయారవుతారు, చదువులో వెనకపడతారు.
– సరదా వేరు, హేళన చేయడం వేరు. హేళన ప్రమాదకరం.
– మితిమీరుతుంటే ఫిర్యాదు చేయాలి. లేకుంటే నష్టపోతారు.
– మానిటర్‌ అనేవారు కూడా విద్యార్థినే అన్నది గుర్తుంచుకోవాలి.
– ఇలాంటివి అరికట్టేందుకు స్కూలు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.
ఇటీవలి కాలంలో ఈ వేధింపులు, అవమానించటాలు కాస్తంత తగ్గాయి. స్కూలు యాజమాన్యాలు విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఇటువంటివాటికి కఠినచర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీచేయడం కొంత ఉపయోగపడుతున్నది. అయినప్పటికీ టీచర్లు తరగతిగదిలో ఇటువంటివి సరదాకి కూడా చేయనీయరాదు.

– డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌