ప్రజలను శక్తివిహీనులుగా చేయడం..

Making people powerless..అన్ని ఫాసిస్టు ప్రభుత్వాలూ ప్రజల్ని శక్తి విహీనులుగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తాయి. మోడీ ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ప్రతీ ఇంటిలోనూ కనీసం ఒకరికి ఉపాధి కల్పించడానికి, అది ఒక ఏడాదిలో కనీసం 100 రోజులపాటు కల్పించడానికి గ్యారంటీ ఇచ్చింది. ఆ విధంగా ఎందరు కోరితే అందరికీ ఉపాధి కల్పించే పథకం. ఆ విధంగా ఒక పరిమితమైన అర్ధంలో ఆ చట్టం ఉపాధి హక్కు కల్పించింది. అందరికీ ఉపాధి కల్పించకపోవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి కల్పించలేక పోవచ్చు. అయినప్పటికీ పరిమితంగానైనా అది ఉపాధి హక్కు కల్పించింది. ఇది నయా ఉదారవాద విధానాలకు పొసగని ఒక హక్కు. కాని వామపక్షాల మద్దతు మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆధారపడక తప్పని పరిస్థితుల్లో ఆ వామపక్షాలు తెచ్చిన ఒత్తిడి ఫలితంగా ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. అప్పటి నుంచీ ఏదో ఒక సాకుతో, ఏదో ఒక విధంగా ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. ప్రస్తుతం ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఈ ప్రయత్నాలు తారాస్థాయికి చేరాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రే ఈ పథకాన్ని వ్యతిరేకించారు.
చాలా ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా మహిళల ఓట్లు కొల్లగొట్టడం కోసం వారికి నగదు బదిలీ చేయడాన్ని బలపరుస్తుంది. నిజానికి అటువంటి నగదు బదిలీలే ఇటీవల బీజేపీ కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన కారణం. అయితే, అదే బీజేపీ ఉపాధి హామీ పథకాన్ని మాత్రం దెబ్బ తీయడానికి పూనుకుంటోంది. ఈ రెండు పథకాలకూ మధ్య ఉన్న తేడా ఏమిటి? నగదు బదిలీ అనేది లబ్ధిదారుల పట్ల దయతో ఇచ్చేది. ఆ లబ్ధి పొందినవారు కృతజ్ఞతను చూపుతారు. అదే ఉపాధి హామీ పథకం అనేది ఒక హక్కు. దాని వలన లబ్ధి పొందినవారు తాము చేసిన పనికి ప్రతిఫలం పొందుతారు. అందుచేత వారు ఎవరి పట్లా కృతజ్ఞత చూపనవసరం లేదు. ఈ విధమైన హక్కు పౌరుల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఇది బీజేపీకి ఎంతమాత్రమూ నచ్చదు. ఉపాధి హమీ పథకం ఒక విధమైన సాధికారతను కల్పిస్తుంది. అదే నగదు బదిలీ ఎటువంటి సాధికారతనూ కల్పించదు. ఆ నగదు బదిలీని ప్రభుత్వం తనకు తోచినప్పుడు నిలిపివేయవచ్చు. ప్రజల వద్ద ఏ అధికారమూ ఉండడం ఫాసిస్టు శక్తులకు ఎంతమాత్రమూ నచ్చదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకం మీద దాడి జరుగుతోంది.
ఈ దాడి అయిదు తరహాలుగా జరుగుతోంది. మొదటిది ప్రభుత్వం జాతీయ మొబైల్‌ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని పట్టుబడుతోంది. ఆ విధానం ప్రకారం పని చేసిన కూలీ తాము పని చేస్తున్న స్థలంలో పని చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను మొబైల్‌ ఫోనులో అప్‌లోడ్‌ చేయాలి. తాము ఆ రోజు పని చేసినట్టు రుజువు చూపడం కోసం ఈ విధంగా చేయాలని కేంద్రం ఆదేశిస్తోంది. అదే విధంగా ఆధార్‌ కార్డు ప్రాతిపదికన వేతనం చెల్లించే వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందుకోసం కూలీల బ్యాంక్‌ అకౌంట్లను ఆధార్‌ కార్డులకు అనుసంధానం చేయాలి. ఈ రెండు పద్ధతులనూ పాటించడం కూలీలకు చాలా కష్టం. మన గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ప్రాంతాలు ఇంటర్నెట్‌తో అనుసంధానం కాలేదు. అందువలన చాలామంది కూలీలు చేసిన పనికి కూలీ పొందే అర్హతను కోల్పోతున్నారు. లిబ్‌ టెక్‌ ఇండియా అనే ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్లు అనుసంధానం కానందువలన 6 కోట్ల 70 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పథకానికి అర్హత కోల్పోయారని న్యూస్‌క్లిక్‌లో వార్తా కథనం వచ్చింది.
రెండవది: ఉపాధి హామీ పథకానికి మంజూరు చేసిన నిధులు అవినీతి పాలయ్యాయని ఆరోపిస్తూ కొన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉపాధిహామీ నిధులను విడుదల చేయకుండా తొక్కిపెడుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ ఆ విధంగానే ఒక ప్రధాన బాధిత రాష్ట్రంగా ఉంది. ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంటే దానిని అరికట్టడానికి సోషల్‌ ఆడిట్‌ విధానం అనేది ఉంది. అటువంటి సోషల్‌ ఆడిట్‌ను రాష్ట్రాలు నిర్వహించడం లేదంటూ కేంద్రం రాష్ట్రాలను తప్పుబడుతోంది. ఐతే సోషల్‌ ఆడిట్‌ చేసే బృందాలకు వేతనాలను కేంద్రమే చెల్లించాలి. ఆ వేతనాలను కేంద్రం చాలా కాలం నుంచీ చెల్లించడం లేదు. ఒకవేళ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అయినా అందుకు శిక్ష కూలీలకు విధించడం ఏ విధంగా సరైనది? ఉపాధి హామీ నిధులు మొత్తంగా కేంద్రమే భరించాలి. ఆ విధంగా చేయకుండా దీన్ని ఒక సాకుగా చూపించి పథకాన్ని నీరుకారుస్తోంది.
వేతన బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించకుండా నిలిపివేయడం మూడవ పద్ధతి. ఇటీవల ఢిల్లీలో ఉపాధి హామీ కూలీల నిరసన ప్రదర్శన జరిగింది. అక్కడకు వచ్చిన కూలీలు తమకు మూడేండ్ల క్రితం నాటి వేతనాలను ఇప్పుడు చెల్లించారంటూ వాపోయారు. చట్టం ప్రకారం ఒకవేళ కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం జరిగితే అప్పుడు ఆ కూలీలకు పరిహారం చెల్లించాలని, ఒకవేళ కూలీలకు పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలని ఉంది. కాని ఇంతవరకూ పరిహారం కాని, నిరుద్యోగ భృతి కాని ఆ కూలీలకు చెల్లించలేదు. ఇది చట్టాన్ని దారుణంగా అతిక్రమించడమే. కాని ఆ అతిక్రమణకు ఇంతవరకూ ఎవరికీ శిక్ష పడనే లేదు. ఎప్పుడైతే వేతనాల చెల్లింపులో విపరీ తమైన జాప్యం చోటుచేసుకుంటోందో అప్పుడు ఉపాధి హామీ పనుల పట్ల ఆ కూలీలలో విముఖత పెరుగుతుంది. తద్వారా ఆ పథకం దెబ్బతిని పోతుంది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులను కేటాయించకపోవడం నాలుగో పద్ధతి. దాని కారణంగానే కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. ఈ తప్పుడు పద్ధతి నిజానికి యుపిఎ-2 ప్రభుత్వం కాలంలోనే మొదలైంది. అప్పటి ఆర్థికమంత్రి పి.చిదంబరం ఎప్పుడూ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులే చేశారు. దానిని ప్రశ్నించినప్పుడు ఆ పథకం ఎటుదిరిగీ పనులు కోరినవారందరికీ పనులు కల్పించాల్సిందే కనుక బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోయినా, అవసరం మేరకు నిధులు విడుదల చేస్తామనంటూ సమాధానం చెప్పేవారు. ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, వేతనాలు చెల్లించాల్సి వచ్చేనాటికి నిధులు అయిపోతే మళ్లీ కేటాయించడానికి కొంత సమయం పడుతుంది. దాని కారణంగా వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతుంది. దాని పర్యవసానంగా ఉపాధి హామీ పనులకు రావడానికి కూలీలు విముఖత చూపుతారు. ఆ విముఖతను సాకుగా చూపించి తర్వాతి ఏడాది బడ్జెట్‌లో నిధులకు మరింత ఎక్కువ కోతలు పెడతారు. ఈ తప్పుడు విధానాన్ని బీజేపీ పతాక స్థాయికి తీసుకుపోయింది.
2024-25లో ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో రూ.86వేల కోట్లు కేటాయించినట్టు చూపారు. చెల్లించవలసిన వేతన బకాయిలను అందులో నుంచి మినహాయిస్తే ఆ ఏడాది పనుల కోసం మిగిలేది సుమారు రూ.60వేల కోట్లు మాత్రమే. ఇది చాలా తక్కువ. దీని వలన ఈ ఏడాది చెల్లించవలసిన వేతన బకాయిలు ఇంకా ఎక్కువగా పేరుకుపోతాయి. ఇలా వేతన బకాయిలు పెరుగుతూ పోవడం వలన ఉపాధి హామీ పనుల కోసం సిద్ధపడే కూలీల సంఖ్య తగ్గిపోతోంది. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో పట్టణాల నుండి కార్మికులు స్వగ్రామాలకు కాలినడకన తిరుగు ప్రయాణం కట్టారు. తమ తమ గ్రామాల్లో ఆ కాలంలో వారు ఉపాధి హామీ పనులకు పూనుకున్నారు. ఆ ఏడాది ఉపాధి హామీ పనుల కోసం విడుదల చేసిన నిధులు రూ.1,13,000 కోట్లు. ఆ విధంగా ఉపాధి హామీ పథకం వారికి ఆ కాలంలో ప్రాణాధారం అయింది. కోవిడ్‌ ముప్పు తొలగిపోయిన తర్వాత కూడా గ్రామాల నుండి పట్టణాలకు తిరిగి పోవడం అనేది జరగలేదు. అంటే ఇప్పుడు ఉపాధి హామీకి కోవిడ్‌ కాలంలో చెల్లించిన మొత్తానికి దరిదాపు సమానంగా కేటాయింపులు ఉండాలి. కాని అందులో సగం మాత్రమే (పాత బకాయిలు పోతే మిగిలినది రూ.60వేల కోట్లే) కేటాయించారు. అంటే ఉపాధి హామీ పనులు చేస్తే కూలీ డబ్బులు ఓ పట్టాన చెల్లించరు అన్న భావన కూలీలలో అంతకంతకూ బలపడేలా కేంద్రం కేటాయింపులు ఉంటున్నాయి. వాస్తవానికి ఉపాధి హామీ కూలీలు డిసెంబర్‌ 6న ఢిిల్లీలో జరిపిన నిరసన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకానికి ఏడాదికి రూ.2,50,000 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీనిని బట్టి ఈ పథకం ఆవశ్యకత ఎంతగా ఉందో స్పష్టం అవుతోంది.
కూలీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించకుండా అతి తక్కువ స్థాయిలోనే కొనసాగించడం ఐదవ పద్ధతి. గ్రామీణ ప్రాంతాల్లో కనీస స్థాయిలో అందవలసిన పౌష్టికాహారం 2200 కేలరీల శక్తిని ఇచ్చేది అయివుండాలని ప్లానింగ్‌ కమిషన్‌ నిర్ధారించింది. ఆ మేరకు ఒక వ్యక్తికి పౌష్టికాహారం అందాలంటే ఒక వ్యక్తికి కనీసం రూ.82 ఖర్చు అవుతుంది. ఒక ఇంట్లో సగటున అయిదుగురు వ్యక్తులు (భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధులు) ఉంటారు. అంటే వారికి కనీస పౌష్టికాహారం అందాలంటే కనీసం రోజు వేతనం రూ.410 ఉండాలి. వాస్తవానికి అంతకన్నా కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే తిండి ఖర్చుతోబాటు విద్య, వైద్యం వంటి ఖర్చులు కూడా ఉంటాయి. వాటిని ప్రయివేటీకరించడం వలన ఆ ఖర్చులు సైతం బాగా పెరిగిపోయాయి.
ఈ కేంద్ర ప్రభుత్వమే నియమించిన నిపుణుల కమిటీ కూడా ఇటీవల ఉపాధి హామీలో కనీస వేతనం రూ.375 ఉండాలని సిఫార్సు చేసింది. కాని ఉపాధి హామీ కూలీ వేతనాలు ఒక్కో రాష్ట్రం లో ఒక్కో విధంగా చాలా వ్యత్యాసాలతో ఉన్నాయి. ఎక్కడా రూ.375 చొప్పున చెల్లించడం లేదు. హర్యానా, కేరళ, కర్నాటక, పంజాబ్‌ రాష్ట్రాలలో మాత్రమే రోజు కూలీ ఉపాధి హామీలో రూ.300 కన్నా ఎక్కువ ఉంది.తక్కిన రాష్ట్రాలలో రూ. 200 నుంచి 300 మధ్య మాత్రమే ఉంది. ఈ అతి తక్కువ వేతనాలను సైతం నెలల తరబడి చెల్లించకుండా బకాయిలు పెడుతున్నారు. కూలీలు ఈ పథకం పట్ల విముఖత పెంచుకోడానికే ఇది దారి తీస్తోంది.
ఇన్ని విధాలుగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హక్కుల ప్రాతిపదికన అమలు జరగవలసిన ఒక పథకాన్ని దెబ్బ తీస్తోంది. స్వాతంత్య్రానంతర కాలంలో చాలా ప్రభావవంతమైన ఒక చట్టం ద్వారా ఈ పథకం ఉనికిలోకి వచ్చింది. దానిని దెబ్బ తీసి ప్రజలు నగదు బదిలీల కోసం దేబిరించేటట్లు వారిని దిగజార్చుతోంది బిజెపి ప్రభుత్వం. ఫాసిస్టు శక్తులతో నిండిన ఒక ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?
(స్వేచ్ఛానుసరణ)
– ప్రభాత్‌ పట్నాయక్‌