మాలలంటే ఎందుకంత చులకనా?

– మా సంఖ్యను తక్కువ చేసి చూపెడతారా?
– మాల, మాదిగలకు సమానవకాశాలొచ్చాయి
– దుష్ప్రచారాలు తిప్పికొట్టేందుకే మాలల సింహగర్జన : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాలలంటే చులకనగా చూస్తూ రాష్ట్రంలో వారి సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని చెన్నూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రిజర్వేషన్లలో మాలలకు ఎక్కువ అవకాశాలు, మాదిగలకు తక్కువ అవకాశా లొచ్చాయనే వాదన సరికాదన్నారు. మాలలకు, మాదిగలకు రాష్ట్రంలో సమాన అవకాశాలొచ్చాయని చెప్పారు. మాలలపై సమాజంలోకి పంపించిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేం దుకే డిసెంబర్‌ 1న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో మాలల సింహ గర్జన ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు జి.చెన్నయ్యతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆర్టికల్‌ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకి స్తున్నామని తెలిపారు. కుల వివక్ష లేదని సుప్రీంకోర్టు పేర్కొందనీ, సమాజంలో ఇంకా కులవివక్ష ఉందని చెప్పారు. క్రిమిలేయర్‌ కు వ్యతిరేకంగా తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ పోస్టులు మాలలకే వస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు. అందుకే ఆత్మగౌరవం కోసం తమ పోరాట మని తెలిపారు. కులవివక్ష, ఆర్థిక వెనుకబాటు ఒక్కటి కాదని రాజ్యాంగంలో అంబేద్కర్‌ పేర్కొన్నారని గుర్తు చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనీ ఎక్కడా లేదనీ, దళితుల్లో విభజన తెచ్చే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. రాజ్యాంగంలో దళితులందరిని కులవివక్ష ఎదుర్కొనేవారిగానే పేర్కొన్నారే తప్ప వేరు వేరుగా కాదని గుర్తుచేశారు. ప్రభుత్వం సేకరిస్తున్న వివరాలు వచ్చాక, మాలల సంఖ్యపై అందరికి ఒక స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ముగ్గురికి ప్రజా ప్రతినిధులు గా అవకాశాలు రావడంపై వస్తున్న విమర్శలను వివేక్‌ తిప్పికొట్టారు. ప్రజలు కోరుకుంటున్నందునే ముగ్గురం గెలిచామని తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో మాదిగలను తాము అణచివేస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదనీ, ఆ జిల్లాల్లో వారు తమతో సఖ్యతతో ఉన్నారని చెప్పారు. తనను సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌నేత సంపత్‌ కుమార్‌ డిమాండ్‌ చేసిన తర్వాత తాను ఆయనతో మాట్లాడినట్టు తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. పైపెచ్చు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా మాట్లాడిన వారున్నారని చెప్పారు.