మాలలకు వీసీ పదవులు ఇవ్వాలి

Malas should be given VC posts– మాల ప్రజా సంఘాల డిమాండ్
నవతెలంగాణ – హైదరాబాద్: ఓట్లేసి గెలిపించిన మాలలకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తుందని మాల ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీసీల నియామకాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయులకు వీసీలుగా మాలల్నే నియమించాలని డిమాండు చేస్తూ శనివారం హైదరాబాదులో ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంచాల లింగస్వామి ఆధ్వర్యంలో మాల ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, తాళ్ళపల్లి రవి, మాల,మాల ఉపకులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్, మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేర బాలకిషన్, మాల జన సభ రాష్ట్ర అధ్యక్షుడు గద్ద శ్రీను, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మేక వెంకన్న, మంత్రి నరసింహయ్యలు పాల్గొని ప్రసంగించారు.  మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ “గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో యావత్తు మాల జాతి మొత్తం కాంగ్రెసు పార్టీకి ఓట్లేసి రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెసు పార్టీ మాలలను పూర్తిగా విస్మరించింది. ప్రత్యేకించి యూనివర్సిటీ వీసీల నియామకాల్లో మాలలకు తీవ్ర అన్యాయం చేసింది. తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను ప్రకటిస్తే అందులో ఒక్క మాల ప్రొఫెసర్ కూడా లేకపోవడం శోచనీయం. వీసీలు ప్రకటించని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయులకు మాల ప్రొఫెసర్లనే వీసీలుగా నియమించాలి. ఈ రెండు యూనివర్సిటీల్లో అర్హత కలిగిన ఒక మాల మహిళా ప్రొఫెసరుకి కూడా అవకాశమివ్వాలి. రెండు యూనివర్సిటీలకు వీసీలుగా మాలలను నియమించకపోతే కాంగ్రెసు పార్టీని మాల ద్రోహిగా ప్రకటించి రాబోయే పంచాయతీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు.