సాహిత్య అకాడమీకి మళయాల రచయిత రాజీనామా

– రాజకీయ జోక్యం మితిమీరుతోందని ఆరోపణ
న్యూఢిల్లీ : ప్రముఖ మళయాల రచయిత సి.రాధాకృష్ణన్‌ సోమవారం సాహిత్య అకాడమీకి రాజీనామా చేశారు. సాహిత్యంలో ఏ మాత్రం ప్రవేశం లేని కేంద్ర మంత్రితో అకాడమీ ఉత్సవాలను ప్రారంభింపజేసినందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాధాకృష్ణన్‌ తన రాజీనామా లేఖను అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావుకు పంపారు. సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్ర కలిగిన అకాడమీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆయన తన లేఖలో ఆరోపించారు. అకాడమీ ఎన్నడూ రాజకీయ ఒత్తిడులకు లొంగలేదని, తన స్వతంత్రతను కాపాడుకుంటూనే వచ్చిందని రాధాకృష్ణన్‌ తెలిపారు. సంస్థ వార్షిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొనడాన్ని అకాడమీ సభ్యులందరూ నిరసించారని, ఇలాంటిది మరోసారి పునరావృతం కాబోదని అధికారులు ఆ తర్వాత హామీ ఇచ్చారని వివరించారు. అకాడమీ 39వ సాహిత్య ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ ప్రారంభించిన కొద్ది వారాలకే రాధాకృష్ణన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఉత్సవాలకు వేలాది మంది రచయితలు హాజరయ్యారు.అకాడమీ రోజువారీ కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం మితిమీరుతోందని రాధాకృష్ణన్‌ విమర్శించారు. లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ కూడా స్వతంత్రతను కోల్పోతున్నాయని చెప్పారు. రాజకీయ జోక్యంపై రచయితల నిరసన గళాన్ని రాష్ట్రపతి, ప్రధాని ఆలకిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాధాకృష్ణన్‌ ఆరోపణలను తోసిపుచ్చుతూ సాహిత్య అకాడమీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజీనామా లేఖలో ఆయన తెలిపిన సమాచారం తప్పుదోవపట్టించేలా ఉన్నదని తెలిపింది. ఉత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఓ రచయితేనని అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ చెప్పారు. గతంలో కూడా కేంద్ర మంత్రులు అకాడమీ ఉత్సవాలలో పాల్గొన్నారని గుర్తు చేశారు.