మల్లారెడ్డి విద్యాసంస్థలపై సీబీఐ విచారణ జరపాలి

– సీట్లను బ్లాక్‌ చేసిన యాజమాన్యాలను అరెస్టుచేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యాసంస్థలపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 12 ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాల్లో పీజీ మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేసి మూడింతల ఫీజుకు అమ్ముకుని మనీ ల్యాండరింగ్‌కు యాజమాన్యాలు పాల్పడ్డాయని విమర్శించారు. 2022లో ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ మట్వాడ పోలీస్‌ స్టేషన్‌లో కేసును స్వీకరించి ఈడీ కేసులు నమోదు చేసిందని తెలిపారు. మల్లారెడ్డి, చల్మెడ, ఎంఎన్‌ఆర్‌ ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలల ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఈడీ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మరో తొమ్మిది ప్రయివేట్‌ కళాశాలపై కూడా విచారణ జరిపించి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి తరఫున ఏవోలను, సంబందంలేని వారిని విచారణకు పంపుతున్నారని తెలిపారు. వారిని కాకుండా యాజమాన్యాలనే విచారించి, అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే బీ కేటగిరీ ఎన్‌ఆర్‌ఐ సీట్లు, యాజమాన్య సీట్లకు వసూళ్లు చేసిన ఫీజులపై కూడా సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కోరారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ హోదా కల్పించాలని తెలిపారు. విశ్వవిద్యాలయంగా ప్రకటించి కాలేజీగా కొనసాగించడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశముందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి మహిళా విశ్వవిద్యాలయానికి హోదా కల్పించాలని కోరారు.