మల్లారెడ్డి మూడు కాలేజీల ‘ఇంటర్‌’ చదువు

– అఫిడవిట్‌పై అభ్యంతరం
–  మేడ్చల్‌ ఆర్వోకు ఫిర్యాదు
నవతెలంగాణ-హైదరాబాద్‌
కార్మిక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అఫిడవిట్‌పై అభ్యంతరం వ్యక్తమైంది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌పై మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయార గ్రామ నివాసి కందాడి అంజిరెడ్డి సోమవారం మేడ్చల్‌ ఆర్వో రాజేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. 2014లో మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేసిన సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఇంటర్‌ విద్యాభ్యాసం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్యాట్నిలో 1973 పూర్తి చేసినట్టు తెలిపారు. 2018లో మేడ్చల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఇంటర్‌ విద్యాభ్యాసం వెస్లీ కాలేజ్‌, సికింద్రాబాద్‌ 1973లో పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అంటే 2023 జనరల్‌ ఎన్నికల్లో మాత్రం రాఘవ లక్ష్మిదేవి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1973లో ఇంటర్‌ విద్య పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
ఒకే సంవత్సరంలో మూడు కాలేజీల్లో మంత్రి మల్లారెడ్డి ఇంటర్‌ విద్యాభ్యాసం ఎలా పూర్తి చేశారో అర్థం కావడం లేదని, ఆ అఫిడవిట్‌ ఓటర్లను, అధికారులను తప్పుదోవ పట్టించేలా ఉందని, తిరస్కరించాలని రిటర్నింగ్‌ అధికారిని కందాడి అంజిరెడ్డి కోరారు. అలాగే, 2014లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో తన వయసు 56 సంవత్సరాలుగా పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి 2023లో మాత్రం తన వయసు 70 సంవత్సరాలుగా పేర్కొన్నారని.. అంటే 9 ఏండ్లలో మాల్లారెడ్డి వయసు 15 సంవత్సరాలు ఎలా పెరిగిందో అర్థం కావడం లేదని అంజిరెడ్డి ఎన్నికల అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు కూడా తప్పుగానే ఇచ్చారని తెలిపారు.