బెలగావి జిల్లా, రాయబాగ్ తాలూకాలో ఉన్న మంటూర్ అనే చిన్న గ్రామంలో ఓ అద్భుతమైన కథగా ఆవిష్కృతమయ్యింది మల్లవ్వ భీమప్ప. 48 ఏండ్ల ఆమె రెండుసార్లు గ్రామపంచాయతీ సభ్యురాలుగా పనిచేసి తన వర్గ ప్రజల పాలిట ఆశాజ్యోతిగా మారింది. తనకు అక్షరం ముక్క రాకపోయినా గ్రామంలోని విద్యార్థుల విద్యా ఆకాంక్షలకు మద్దతుగా నిలబడింది. గ్రంథాలయాన్ని స్థాపించేందుకు సిద్ధమయ్యింది. లైబ్రరీ నిర్మాణం కోసం తన పొదుపు డబ్బునే ఉపయోగించిన ఆమె స్ఫూర్తిదాయక పరిచయం మీ కోసం…
సుమారు 6,000 మంది జనాభా ఉన్న మంటూరులో విద్యా వనరులు అంతంత మాత్రమే. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత విద్య కోసం విద్యార్థులు గోకాక్ లేదా రాయబాగ్ వంటి పట్టణాలకు వెళ్లాలి. అంత దూరం ప్రయాణించడం, అందుబాటులో సరైన స్టడీ మెటీరియల్ లేకపోవడంతో గ్రామంలోని చాలా మంది పిల్లలు ఉన్నత విద్యకు దూరమయ్యారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మల్లవ్వ ఈ విషయాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమెకు చదవడం, రాయడం రాకపోయినా సరైన విద్యా అవకాశాలు లేకపోవడం పిల్లల అవకాశాలు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిపై ఎలా ప్రభావం చూపుతుందో గమనించింది.
సవాళ్లను అధిగమిస్తున్నారు
స్మార్ట్‌ఫోన్‌లు, డిజిటల్ సాధనాలు ఆధిపత్యం చెలాయించే యుగంలో పుస్తకాల అవసరం ఎలాంటితో మల్లవ్వకు స్పష్టంగా అర్థమయ్యింది. విద్యార్థులకు సరైన మెటీరియల్ అందుబాటులో ఉంటే వారు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని గుర్తించింది. అంతేకాదు చదువుతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలరని విశ్వసించింది. ‘విద్య, జ్ఞానం గ్రామానికి మరింత శ్రేయస్సును తీసుకురాగలవు’ అని ఆమె బలంగా నమ్మింది. కనుక ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆమె సంకల్పం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లింది. తన ప్రతిపాదనను మంటూరు గ్రామ పంచాయతీ ముందు పెట్టింది. అయితే మిగిలిన సభ్యులందరూ ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. కానీ ఆమె మాత్రం ఆగలేదు. గ్రంథాలయ స్థాపన తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది. పంచాయతీకి రెండుసార్లు పనిచేసిన సభ్యురాలిగా వ్యవస్థను ఎలా నావిగేట్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. అయితే మద్దతు కోసం సంఘం వైపు మొగ్గు చూపింది.
లైబ్రరీని నిర్మించడం
గ్రామంలో 15 ఏండ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ టవర్‌కు లీజుకు ఇచ్చిన భూమిని ఇటీవలే ఖాళీ చేయించిన బిర్సిద్దేశ్వర్ టెంపుల్ ట్రస్టును ఆమె ఆశ్రయించింది. టవర్ యంత్రాలను ఉంచేందుకు చిన్న ఫైబర్ బ్లాక్ అక్కడ ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్‌ను లైబ్రరీగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలని మల్లవ్వ ట్రస్టు సభ్యులతో మాట్లాడి ఒప్పించింది. ఆ బ్లాక్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో విద్యార్థుల కోసం మరో బ్లాక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అలా మల్లవ్వ తన వ్యక్తిగత డబ్బుతో కొత్త బ్లాక్ నిర్మాణం జరిగింది. ఆ అదనపు నిర్మాణం కోసం ఆమె రూ.1.2 లక్షలు వెచ్చించింది. ఈ మొత్తంలో కొంత భాగం గృహ లక్ష్మి యోజన నుండి పొందింది. మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో రూపొందించబడిన ప్రభుత్వ పథకం ఇది. అలాగే గ్రామస్తులు, స్థానిక వ్యాపారస్తుల ద్వారా మరో రూ.30 వేలు సేకరించింది. వడ్రంగి ఫర్నిచర్‌ను విరాళంగా ఇచ్చాడు. మరికొందరు పుస్తకాలను అందించారు. ఇలా అందరి సహకారంతో మంటూర్ పిల్లలకు చక్కటి లైబ్రరీని ఏర్పాటు చేసింది. ‘సంకల్ప గ్రామ సేవా సంఘం’ బ్యానర్ కింద 2024, సెప్టెంబర్ 19న ఈ లైబ్రరీని స్థాపించింది. అప్పటి నుండి విద్యార్ధులు చదువుకోవడానికి, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి, వారు కొనుగోలు చేయలేని, దొరకని పుస్తకాలను అందుబాటులో ఉంచడానికి ఇది ఒక గొప్ప ప్రదేశంగా మారింది.
విజన్ ఉన్న నాయకురాలు
మల్లవ్వకు విద్య లేకపోయినా ఆమె దృష్టి ఎప్పుడూ గ్రామ విద్యపైనే కేంద్రీకృతమై ఉంది. విద్యా వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆమె తన పిల్లలను కూడా చదివించలేకపోయింది. అయినప్పటికీ మనుషుల జీవితాల్లో విద్య తీసుకొచ్చే మార్పుపై ఆమెకు నమ్మకం ఉంది. అందుకే ఆమె తన చిన్న కోడల్ని ఉన్నత చదువులు చదివేందుకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందు బెంగళూరు వెళ్లేందుకు ప్రోత్సహించింది. మల్లవ్వ లైబ్రరీ ఏర్పాటు చేయడంతోనే తన పని పూర్తయినట్టు భావించలేదు. అది పటిష్టంగా, సమర్ధవంతంగా పని చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది గ్రామానికి దీర్ఘకాలిక ఆస్తిగా ఉండేలా చూసుకుంది. రాబోయే నాయకత్వం పట్ల ఆమె ఆలోచనాత్మక విధానానికి ఇది ఓ తార్కాణం. అలా లైబ్రరీ భవిష్యత్తు నిర్వహణకు కూడా ఆమె భరోసా ఇచ్చింది.
స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్
ఇతరులకు సాయం చేయాలంటే గొప్ప ధనవంతులే కానక్కర్లేదని మల్లవ్వ రుజువు చేసింది. చాలా మంది సమాచారం కోసం సాంకేతికతపై ఆధారపడే సమయంలో మల్లవ్వ పుస్తకాల విలువను, విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించే భౌతిక స్థలం అవసరాన్ని గుర్తించింది. గ్రామీణ సమాజంలో సాంకేతికత మాత్రమే పరిష్కరించలేని లోటును ఆమె ప్రయత్నాలు భర్తీ చేశాయి. గ్రంథాలయ సమస్య తాలూకా పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. కనుక రాయాబాద్ తహశీల్దార్ సురేష్ ముంజే తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారితో కలిసి త్వరలో ఆ నూతన గ్రంథాలయాన్ని సందర్శిస్తానని, మల్లవ్వ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌లు అనేక సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రజయోజనాలను యువతకు అందించాలని మల్లవ్వ అర్థం చేసుకుంది. కనుకను ఆమె చొరవ మంటూరు పిల్లలకు పెద్ద కలలు కనడానికి, కష్టపడి చదవడానికి, వారి జీవిత పథాన్ని మార్చడానికి అవసరమైన వనరులను అందించింది.