
వర్షా బావ పరిస్థితుల మూలంగా ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్ లో నాగార్జునసాగర్ ఆయకట్టు క్రింద, ఎస్సారెస్పీ ప్రాజెక్టు క్రింద వరి సాగు చేసిన పొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మూలంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోవడంతో నీళ్లు రాక సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు, ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద రైతులు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు బావులు తీసుకున్న నీళ్లు రాక వేసిన వరి పంట ఎండిపోయాయని అన్నారు. రైతాంగం ఒక ఎకరాకు రూ.40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేశారని తీరా పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేక వరి పంటలు ఉండిపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. దీంతో తెచ్చిన అప్పులు పూడక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించిందన్నారు. వెంటనేవ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు ఎండిపోయిన పంటలపై విచారణ జరిపి ఎకరానికి రూ.25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి కరువు సహాయక చేరను చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రెవిన్యూ కలెక్టర్ కు ప్రతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సైదా, రైతు సంఘం జిల్లా నాయకులు మందడి రామ్ రెడ్డి,బెల్లంకొండ సత్యనారాయణ,ఏనుగుల వీరాంజనేయులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పట్నం జిల్లా కార్యదర్శి జిల్లపల్లి నరసింహారావు, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు రణ పంగ కృష్ణ, నాగటి చిన్న రాములు, ప్రజాసంఘాల నాయకులు కోడి ఎల్లయ్య, కిన్నెర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.