పోషకాహారం లోపం… పాలకుల వైఫల్యం!

Malnutrition... Failure of rulers!పౌష్టికాహార లోపం ప్రబలమైన భారంతో మనదేశం గణనీయ మైన సవాలును ఎదుర్కొంటోంది. ఈ సమస్య దేశంలోని సామాజిక, ఆర్థిక సాంస్కృతిక వ్యత్యాసాల సంక్లిష్ట మిశ్రమంతో ముడిపడి ఉంది. ఒక వ్యక్తి వయసుకు తగ్గ పోషకాలను తీసుకోకపోవడం దేశంలోని దారిద్య్రాన్ని సూచిస్తోంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రకారం పోషకాహారం అందించే విషయంలో 2023లో మనదేశం 111వ స్థానంలో నిలిచింది.”ఒక వ్యక్తి ఏడాది వ్యవధిలో రోజువారీ కనీస ఆహారశక్తి అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని పొందలేకపోవడాన్ని పౌష్టికాహార లోపం” అని అంతర్జాతీయ సంస్థలు నిర్చించాయి. అధిక పోషణను కూడా పౌష్టికాహారలోపంగానే పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడం గమనార్హం. పోషకాహారలోపమనేది ఐదేండ్లకంటే తక్కువైన పిల్లలోను, గర్భిణీల్లోనూ, యుక్తవయస్సు వారిలో ఎక్కువగా ఉంటుంది. పోషకాహార లోపాన్ని వేస్టింగ్‌ (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ), స్టంటింగ్‌ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం), తక్కువ బరువు కలిగి ఉండడం, విటమిన్లు మినరల్స్‌ లోపాలు అనే నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. దీనికితోడు అధిక బరువు, ఊబకాయం కూడా పోషకాహార లోపం కిందకే వస్తాయి. ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధ పడుతున్నవారిలో 19.46 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. ఇది మొత్తం దేశ జనాభాలో 13 శాతానికి సమానమని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆహార భద్రత పోషకాహార స్థితి (ఎస్‌ఒఎఫ్‌ఐ) తాజా నివేదిక 2024 తెలిపింది. ఈ సంఖ్య 2004-06లో 24 కోట్లు ఉండగా తర్వాత కాలంలో 55.6శాతం (79 కోట్లు) ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదని పేర్కొంది. దేశ జనాభాలో సరైన ఆహారం లభ్యంకాక 16.6శాతం పోషకాహార లోపంతో ఉన్నారని, కనీసం 38శాతం అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారని ఈ ఏడాది మే 29న విడుదల చేసిన గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్ట్‌ 2024 తెలిపింది.
పేదరికమే ప్రధాన కారణం
పోషకాహార లోపం ఉన్న పిల్లలు తరుచుగా వ్యాధులకు గురవ్వడమేకాక మరణించే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి జరగక అభ్యాస సామర్థ్యాలు, విద్యా పనితీరు సరిగా జరగదు. సూక్ష్మపోషకాలు, ఐరన్‌, విటమిన్‌-ఎ, జింక్‌ లేని ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతిని వేగంగా అంటువ్యాధులు ప్రబలుతాయి. కుటుంబ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. యుక్తవయస్సులో పోషకాహార లోపంవల్ల ఉత్పాదకత తగ్గి దేశ జీడీపీ తగ్గుతుంది. రక్తహీనత తల్లులు అనారోగ్య శిశువులకు జన్మనిచ్చి పోష కాహార లోపా చక్రాన్ని శాశ్వతం చేస్తారు. పోషకాహార లోపం తరచుగా ఆర్థికంగా అట్టడుగు, వెనుకబడిన వర్గాలను ప్రభావితం చేస్తున్నది. ఇది సామాజిక అసమానతలను పెంచుతున్నది. దీనికి గలకారణాలలో అత్యంత ప్రధానమైనది పేదరికం. వీరిలో కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం వలన సంతులిత ఆహారాన్ని తీసుకోలపోవడంతో ఈ సమస్య రోజురోజుకూ మరింత ఉత్పన్నమవుతున్నది. ఒకరి సంపాదనపైనే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తారు. మలేరియా, అతిసారం వంటి అంటువ్యాధులు పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. గర్భంతో ఉన్నవారికి ఎక్కువ మోతాదులో పోషకాలు అవసరం. కాని వారికి సరైన అవగాహన లేక పోషకాహార లోపానికి గురవుతున్నారు. కొన్ని కుటుంబాలలో బాలురతో పోల్చితే బాలికలకు తక్కువ ఆహారాన్ని అందజేయడం ఈ లోపానికి ఒక కారణం. అనాథ పిల్లలు, వృద్ధులు ఎక్కువ శాతంలో పోషకాహార లోపానికి గురవుతారు. గిరిజనులు, సామాజికంగా వెనుకబడినవారు, మురికివాడ నివాసితులు, సంచార జాతులు తదితర వారికి తగినంత ఆర్థిక పరిపుష్టి లేక సమతుల్య ఆహారాన్ని పొందలేకపోతున్నారు. పేలవమైన పారిశుధ్యం, పరిశుభ్రత పద్ధతులు వ్యాధులకు కారణమయ్యే పరాన్నజీవులకు గురికావడాన్ని పెంచుతుంది. ఇవి శరీరంలోని పోషకాల శోషణ వినియోగాన్ని ప్రభావితం చేసి పోషకాహార లోపాన్ని పెంచు తున్నాయి. ఎగువ మధ్య తరగతి, ఎగువ తరగతి ప్రజలలో కూడా పోషకాహార లోపం ఉంటుంది. తగినంత సంపాదన ఉన్నా కూడా పాలిష్‌ చేసిన బియ్యం వాడ టం, పిజ్జాలు బర్గర్లు తినడం లాంటి అలవాట్లు, పని ఒత్తిడిలో వేళకు భోజనం చేయకపోవడం వలన వీరు పోషకాహార లోపానికి గురవుతున్నారు. మన దేశంలో ఆహార వైవిధ్యం లేకపోవడం, తక్కువ నాణ్యత గల ఆహారాన్ని తీసుకోవడం కూడా ఒక కారణం. మన ఆహారంలో ఐరన్‌, విటమిన్లు, జింక్‌ వంటి ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటున్నాయి.
పథకాలున్నా ఫలితం శూన్యం!
అంగన్వాడీ వ్యవస్థ, పోషన్‌ అభియాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌, ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ , ప్రధాన మంత్రి మాతృవందన యోజన, పాఠశాలలో మధ్యాహ్న భోజనం, కౌమార బాలికల పథకం, గర్భిణిలకు ప్రత్యేక ఆహారం అందించుట లాంటి కార్యక్రమాలను ప్రభు త్వాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి అమలులో చిత్తశుద్ధి లోపించింది. అంగన్‌వాడీ లాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసే పద్ధతికి కంద్రం పూనుకుంది. తగిన నిధుల్ని కేటాయించి ఆరోగ్యవ్యవస్థల్ని పటిష్టం చేయాల్సిన పాలకులు వాటికి బడ్జెట్‌లో కేటాయిం పులు అంతంత మాత్రంగానే కేటాయించడం శోచనీయం. జాతీయ ఆరోగ్య విధానం 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో ప్రస్తుతమున్న 1.2శాతం నుండి 2.5శాతానికి పెంచాలని చేసిన సిఫార్సును అమలు చేయాలి. పోషకాహారం, ఆహార భద్రత, పేదరికం ఒకదానితో మరొకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. పేదరికాన్ని రూపుమాప డానికి కృషి చేయాలి. అందరకీ ఆహార భద్రతను కలిగించాలి. గిరిజను లకు, ఆర్థికంగా అట్టడుగు వర్గాలకు, పోషకాలు కలిగిన ధాన్యాలను, పదార్థాలతో పాటు పండ్లను పౌర సరఫరాల దుకాణాల ద్వారా సబ్సిడీతో అందివ్వాలి. వ్యాధి నిరోధక టీకాలును ప్రతిఒక్కరూ వేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సౌకర్యాలు పెంచాలి. స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో ప్రసవానంతర సామాజిక మూఢనమ్మకాలు, కట్టుబాట్లను తెంచి, ప్రజలలో చైతన్యం పెంచాలి. అప్పుడే దేశాన్ని పోషకాహారలోపం నుంచి కొంతైనా బయటపడేయగలం.
(సెప్టెంబర్‌ 1 నుంచి 7వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు)
– డిజె మోహనరావు, 9440485824