– నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా గుడిసెలోనే..
– ప్రజాభిమానమే మిన్నగా భావించిన మహోన్నతుడు
ఆస్తులు.. సంపాదన కన్నా ప్రజాభిమానమే గొప్పదని.. కడవరకు దాని కోసమే.. ప్రజల కోసమే జీవించిన గొప్ప ప్రజానాయకుడు ఉప్పల మల్సూర్. నాలుగు సార్లు సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజల సేవకే జీవితాన్ని అంకితం చేశారు. ఆస్తులకంటే ప్రజాభిమానమే మిన్నగా భావించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారు. తుది శ్వాస వరకు గుడిసెలోనే కాలం వెళ్లదీశారు.
సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో మల్లయ్య- లచ్చమ్మ దంపతులకు 1928 సెప్టెంబర్ 8న ఉప్పల మల్సూర్ జన్మించారు. నాలుగో తరగతి వరకు చదివారు. చిన్నతనం నుంచే కమ్యూనిస్టు భావాలకు ఆకర్శితులయ్యారు. ఆయన ఆలోచనలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వైపు మళ్లాయి. సాయుధ పోరాటంలో అత్యంత ధైర్యసాహసాలతో పోరాడారు. 1948లో సూర్యాపేట దగ్గర చందుపట్ల గ్రామంలో పోలీసులకు చిక్కారు. చిత్రహింసలకు గురయ్యారు. రాజమండ్రి సబ్ జైలు నుంచి 1951లో విడుదలయ్యారు. 1952 నుంచి 1972 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1952లో పీడీఎఫ్ తరపున, 1957లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పక్షాన, 1967, 72లో సీపీఐ(ఎం) తరపున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1990లో సిరికొండ సర్పంచ్‌గా పని చేశారు. నాడు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేక పోవడంతో ప్రజలే ఎన్నికల ఖర్చులు సమకూర్చి ఘన విజయానికి బాటలు వేశారు. అభాగ్యుల పక్షాన నిలబడిన మహోన్నత వ్యక్తి మల్సూర్. ఎమ్మెల్యేగా ఉన్నా సైకిలే ఆయన వాహనం. చివరి దశలో చెప్పులు కుట్టుకుంటూ బతుకెళ్లదీశారు. 1999 జనవరి 13న ఆ పూరి గుడిసెలోనే తుది శ్వాస విడిచారు. ఆయన భార్య లచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి సర్పంచ్‌గా పనిచేసినా మల్సూర్ నిరాడంబర జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. ఆయన జీవించి ఉండగా తన 500 గజాల స్థలాన్ని పాఠశాలకు ఇస్తామన్నారు. ఆయన మాట ప్రకారం కుమారుడు దాన్ని నెరవేర్చారు.