కరీంనగర్‌ కమాన్‌ మీద విరిసిన మమతల హరివిల్లు

‘కాంతి జనితం కరీంనగరం – క్రాంతి భరితం మన కరీంనగరం’ అంటూ కరీంనగర్‌ వైభవగీతంలో అంటారు డా.వడ్డేపల్లి కృష్ణ. మానేరు తీరాన, దోమినార్‌ సాక్షిగా తెలుగు భాషకు ప్రాచీన హౌదా దక్కేందుకు మూలంగా నిలిచిన జినవల్లభుని కంద శాసనం, హాలుని గాధా సప్తశతులకు నెలవైన నేల ఇది. ఈ నేల నుండి జ్ఞానపీఠం నుండి సాహిత్య అకాడమి బాల పురస్కారాల వరకు అందుకుని నిలిచిన కవులున్నారు. ఈ కోవలోనే బాల సాహిత్యాన్ని సృజిస్తున్న వారిలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన కవయిత్రి, రచయిత్రి ఉపాధ్యాయిని, బాల సాహితీవేత్త ఐల మమత ఒకరు. ఐల మమత అగస్టు 7, 1970న కరీంనగర్‌ జిల్లా చెర్ల బూత్కూర్‌లో పుట్టింది. శ్రీమతి గద్దె ఉపేంద్రమ్మ, శ్రీ గద్దె రఘునందం వీరి అమ్మా నాన్నలు. తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర పట్టా పొందిన మమత తెలుగు పండిత శిక్షణ పూర్తిచేసి తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది.
పాఠాలతో పాటు పాటలు, పద్యాలు, గేయాలు, వచన కవితలు రాస్తున్న అనిత బాలల కోసం చక్కని గేయాలు, కథలతో పాటు ఇతర రూపాల్లో రచనలు చేస్తున్నారు. పద్యాన్ని అత్యంత ప్రేమించే మమత కంద పద్యాలు, సీస పద్యాలు, ఆటవెలదుల్లో తన రచనలు చేశారు. గృహిణిగా చదువుకుని ఉపాధ్యాయినిగా రాణిస్తున్న ఐల మమత పద్యకవిగా ‘ఖండ కావ్యము’ అచ్చువేశారు. ‘మమత శతకం’ పేరుతో ఆట వెలది పద్యాలు రాశారు. వివిధ అంతర్జాల సాహిత్య సంస్థలు, వాట్సప్‌ గ్రూప్‌లలోనూ, మణిపూసల సంస్థలు నిర్వహించిన సాహిత్య సృజనకారక్రమాల్లోనూ పాల్గొన్న మమత ‘సహస్ర మణిపూసల కవి భూషణ’, ‘ఇష్టపది భూషణ’, ‘భారత కీర్తి పురస్కారం’, ‘కవితా భూషణ్‌’ బిరుదులతో పాటు ‘గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారం’ అందుకున్నారు. తన తొలి రచనను మణిపూసల రూపంలో ‘రుక్మిణీ కళ్యాణం’ పేరుతో వెలువరించారు మమత. ‘కృష్ణుండు వస్తుండెన! / అంతయదృష్ట ముండెన! / సర్వ సమర్థుడతడు / నా మాట వింటుండెన’, ‘… నిండైనదీ శుభదినము / జరుగుచుండెను వివాహము / పెద్దల సమక్షమున / రంగ రంగ వైభోగము’ వంటి గేయ మణులు ఇందులో ఉన్నాయి.
బాలల కోసం గేయాలు, పాటలు రాసిన అనిత తన తొలి బాల సాహిత్య రచనగా ‘మమతల హరివిల్లు’ బాల గేయాల సంపుటిని తెచ్చారు. పిల్లల కోసం రచనలు చేయడం అందరికీ సాధ్యం కాదు, అయినా బాలల మనస్తత్వానికి దగ్గరగా వస్తువు, భాష, అంశం, శైలి వంటివి ఒక్కచోట సాధించడం కష్టమే. ఇటీవల వస్తున్న అనేక గేయ రచనలు నా మాటలను తప్పని చప్పకనే చెబుతున్నాయి. ఎంత శుభ పరిణామమో కదా! ఐల మమత రచనలో తనదైన ఒక శైలి స్థిరపడిందని డా. ఎనుగు నరసింహా రెడ్డి అంటారు. అంతేకాదు మమతకు లయ బాగా అలవడిందంటారు. గేయానికి కావలసిందిదే మరి! ‘చదువు’ గేయంలో ‘అందమైనదీ పలుకమ్మ’ అని చెప్పడం బాగుంది. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల కాలంలో కాన్వెంటు పిల్లలకు పలుకమ్మ పరిచయం, పలుకమ్మ అందాలు తెలియక పోవచ్చు కానీ పలుకా బలపపు ప్రాణ స్పర్శ తెలిసిన నాకు ఈ గేయం నచ్చింది.
‘అందమైనదీ పలుకమ్మ / బలుపం పట్టి దిద్దమ్మ/ .. అమ్మా నాన్న మెచ్చేరు/ పంతులమ్మ మెచ్చేరు’ అని చెబుతుంది కవయిత్రి ఈ గేయంలో. బాల సాహిత్యం ప్రధాన లక్ష్యం బాలలకు ఆనందాన్ని కలిగించడం, తరువాత హేతువును పెంచి ఆలోచనను కలిగించడం. మమత తన గేయాల్లో ఆ పని చేసింది. అటువంటి గేయమే ‘రంగురంగుల పక్షులు’. ఇందులో పిల్లల చేతిలో అరటిపండు ఒలిచి పెట్టకుండా వారిని ఆలోచింపజేజే విధంగా ‘పిల్లలు చక్కగ కూర్చోండి/ ఆలోచించి చెప్పండి/ … కావుకావుమని అంటుంది/ నల్లగ తాను వుంటుంది/ .. కుహూకుహూ మని కూసేను/ కమ్మగ పాట పాడేను’ అంటూ ఆలోచనల కేంద్రంగా గేయాలు మలుస్తుంది మమత.
ఇంకా ‘అదిగో చూడండా హద్దు/ భారతదేశపు సరిహద్దు’ అంటూ జవాన్‌ను పరిచయం చేస్తే, మరో గేయంలో ‘పచ్చని పైరుల పంట కోము/ కష్టించెడి ఓ రైతన్నా’ అంటూ కిసాన్‌ను చూపిస్తూ ‘అన్నదాతవు నీవన్న/ ఆకలి తీర్చే రైతన్న/ నీ కష్టమైన శ్రమ లేకుంటే/ దేశం బతికేదెట్లన్న’ అంటుంది. ఒక గేయంలో ‘తొక్కుడుబిల్ల ఆడెదము’ అంటూ గ్రామీణ క్రీడలను పరిచయం చేస్తుంది. మరో గేయంలో ఎండాకాలంలో పిల్లలు ఆడాల్సిన ఇండోర్‌ గేయాలను చూపిస్తుంది కవయిత్రి. ‘కోతిబావ వచ్చాడు/ కొమ్మమీద కూర్చున్నాడు/ కొబ్బరిముక్క పెడదమ/ కోతిబావతో ఆడుదమా’ అంటూ ఒక గీతం సరదాగా సాగితే, ‘మూడనమ్మకాల ముసలమ్మ/ బాల వివాహాలొద్దమ్మ’ గేయం చైతన్యగీతం. గేయకథలు, బాలల మానసిక స్థితిగతులు, సరదాల పాటలు, స్ఫూర్తి గేయాలు, ఆటల పాటల గేయకథలు వెరసి మమతల హరివిల్లు గేయ సంపుటి. తన తొలి సంపుటిలోనే బాలల కోసం చక్కని గేయాలను లయాత్మకంగా అందించిన ఐల మమత మరిన్ని పుస్తకాలు బాలల కోసం మానేరు నేల నుండి తేవాలని ఆకాంక్షిస్తూ… జయహో బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548