– జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో పట్టుబట్టడం ఇదే ప్రథమం : అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ నాగేందర్ రావు
నవతెలంగాణ-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్‌లో రూ.40 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు వివరాలు వెల్లడించారు. నెల్లికుదురు మండలం లోని లక్ష్మీపురం గ్రామం వద్ద మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నుంచి తొర్రూరు వైపు వెళుతున్న షిఫ్ట్ డిజైర్ కారు అధిక వేగంతో వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారును వెంబడించారు. అతివేగంతో వెళ్తున్న కారు పల్టీ కొట్టింది. కారును చేజ్ చేసిన పోలీసులు వెంటనే కారును అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా డిక్కీలో 200 కిలోల 100 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని కారు నడుపుతున్న వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు.. ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిత్తాపురం గ్రామానికి చెందిన కుంచాల జయచంద్రుగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. నిందితుని ఫోన్ నెంబర్ల ఆధారంగా గంజాయి ఎక్కడికి రవాణా అవుతుంది..? ఎవరు ఆర్డర్ చేశారు.. ? దీని వెనుక ఎవరెవరి హస్తం ఉంది..? అన్న కోణంలో విచారణ జరుపు తున్నట్టు ఏసీపీ నాగేందర్రావు తెలిపారు. సమావేశంలో ఏఈ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, తొర్రూరు ఎక్సైజ్ సీఐ భాస్కరరావు, ఎక్సైజ్ ఎస్‌ఐ రవళి, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ హరీష్, తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.