నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఫైనాన్స్ వేధింపులు తాళలేక చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆరవ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని నెహ్రూ నగర్ కు చెందిన షేక్ ఖయ్యూం (48), గత మూడు సంవత్సరాల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ లో ఇంటిపైన మడ్గేజ్ లోన్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతనికి పక్షవాతం వచ్చి మంచానికి అంకితం అయ్యాడని తెలియజేశారు. గత మూడు నెలలుగా ఫైనాన్స్ కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటికి వచ్చి ఫైనాన్స్ కట్టని యెడల ఇంటిని జప్తు చేయిస్తామని బెదిరించడంతో ఖంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక ఈ నెల 16 న ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. పక్కనే ఉన్న అశోక్ సాగర్ గట్టు పైన అతని చెప్పులు, చొక్కా కనిపించడంతో చెరువులో గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీస్ లు పేర్కొన్నారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.