
గుండాల మండల కేంద్రానికి చెందిన రంగు యాకయ్య (42) జ్వరంతో శనివారం మృతి చెందాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు జి.మనీష్ రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకయ్య ఈనెల 7వ తేదీ నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జ్వరానికి (పారాసెటమాల్), తదితర మాత్రలు వేసుకోవడం జరిగింది. జ్వరం ఎక్కువ కావడంతో 10వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకోగా రిపోర్ట్స్ లో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరం లేదని, తెల్ల రక్త కణాలు 77 వేలే ఉన్నాయని, కళ్లు పచ్చగా ఉండటం గమనించి, అదేరోజు మెరుగైన వైద్యం కోసం వెళ్లాలని రిఫర్ చేయడంతో వరంగల్ ఆసుపత్రికి వెళ్లారని వైద్యులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ యాకయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. దాంతో మృతుడి భార్య వాణి, కొడుకు వాసు, కూతురు వర్షిత, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యాకయ్య జ్వరంతో ఉన్న సమయంలో ఆహార, ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే మృతికి గల కారణాలుగా స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా వరంగల్ ఆసుపత్రి రక్త పరీక్షల రిపోర్ట్స్ చూస్తే కానీ మృతికి కారణాలు తెలుస్తాయని వైద్యులు తెలిపారు.