
ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలు అయిన ఘటన ఆళ్ళపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ముత్తాపురం గ్రామానికి చెందిన గుంపిడి ఎర్రయ్య, పూసం స్వరూప వ్యక్తిగత పని నిమిత్తం అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. చింతోళ్లగుంపు గ్రామంలో ఉన్న రేంజ్ కార్యాలయం వైపు రోడ్డు దాటుతున్న సమయంలోనే ఎదురుగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఒకే బైక్ పై వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఎర్రయ్య, స్వరూప రోడ్డుపై పడ్డారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇరువురు క్షతగాత్రులని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందించగా ఎర్రయ్యకు కంటి వద్ద, నడుముకి తీవ్రంగా గాయాలు, స్వరూపకు స్వల్ప గాయాలైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దాంతో ఎర్రయ్యను మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు స్థానిక 108 వాహనంలో తీసుకెళ్లారు. ఎదురుగా బైక్ పై వచ్చిన ఢీకొట్టిన వారు పడి వెంటనే అక్కడనుంచి బైక్ తో పరారయ్యారని, ఆ సమయంలో వారిని గుర్తపట్టలేకపోయామని స్వరూప వాపోయారు.