అక్షలి షా… భారతదేశ పాడి పరిశ్రమను ఆధునీకరించేందుకు సిద్ధమయ్యారు. తండ్రి ప్రోత్సాహంతో ప్రపంచ పాల ఉత్పత్తులను అధ్యయనం చేశారు. మంచార్‌లోని తమ భాగ్యలక్ష్మి డైరీ ఫామ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ప్రవేశించిన నాటి నుండి అనేక అంశాల గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు. అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరిగేలా తన సంస్థను ఆధునీకరించి మంచి వ్యాపార వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే పాల ఉత్పత్తుల తయారీలో తన సంస్థకు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వ్యాపారంలోకి ప్రవేశించాలంటే మహిళలు ముందు తమలోని సామర్థ్యాలను తాము విశ్వసించాలని చెబుతున్న ఆమె పరిచయం…
పూణే సమీపంలోని చిన్న పట్టణమైనా మంచార్‌లో పుట్టి పెరిగిన అక్షలి షా చిన్నతనం గ్రామీణ జీవితంతో ముడిపడి వుంది. పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి డైరీ ఫామ్‌లో పెరిగిన ఆమె ప్రకృతిని గమనిస్తూ ఉండేది. డైరీలోని ఆవులను, సేంద్రీయ వ్యవసాయాన్ని చూస్తూ అమూల్యమైన పాఠాలను నేర్చుకున్నారు. ‘ఆవు దూడలు, రైతులతో ఎక్కువ సమయం గడపడం వల్ల నమ్మకం, స్థిరత్వం, సమాజ శక్తి గురించి తెలుసుకునే అవకాశం దక్కింది’ అని షా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
పాడిపరిశ్రమపై అభిమానంతో…
పాడి పరిశ్రమలో అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో షా తన పాఠశాల విద్యను పూణేలో కొనసాగించి, ఎస్‌పీ జైన్ గ్లోబల్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. పదమూడేండ్ల కిందట మేనేజ్‌మెంట్ ట్రైనీగా పరాగ్ మిల్క్ ఫుడ్స్‌లోకి ప్రవేశించింది. వ్యాపారంలోని ప్రతి విషయంపై అవగాహన పెంచుకునేందుకు కృషి చేశారు. ‘నేను కుటుంబ వ్యాపారంలో చేరాలని మొదట్లోనే నిర్ణయించు కున్నాను’ అని ఆమె చెప్పారు. సంస్థ వారసత్వాన్ని కాపాడుకుంటూ వ్యాపారాన్ని ఆధునీకరించాలనే తపనతో ఆమె తన ప్రయాణం ప్రారంభించారు. గ్రౌండ్ లెవల్ నుండి తన పని మొదలుపెట్టారు. కంపెనీ కార్య కలాపాలపై సూక్ష్మ అవగాహనను పెంచుకున్నారు. తాజా ఆలోచనలను వ్యాపారంలో మిళితం చేసుకునేందుకు కృషి చేశారు. దీనికోసం ఆమె చురుకైన నాయకత్వ పాత్రను పోషించారు.
ఆమె నాయకత్వంలో…
పరాగ్ మిల్క్ ఫుడ్స్ ప్రధానంగా అమ్మకాలపై ఆధారపడ్డ సంస్థ. ప్రారంభం నుండి ఆమె లక్ష్యం, దాన్ని బలమైన మార్కెటింగ్ పవర్‌హౌస్‌గా మార్చడం. ‘సంస్థను వినూత్న ఆలోచనలతో నింపాలని, బలమైన బ్రాండ్ ఉనికిని సృష్టించాలని నేను కోరుకున్నాను’ అని ఆమె చెప్పారు. ఆమె నాయకత్వంలో పరాగ్ మిల్క్ ఫుడ్స్ భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ డెయిరీ ఖీవీజ+ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. ఇప్పుడు ఇది 20 కంటే ఎక్కువ దేశాలలో తన ఉనికిని నిలబెట్టుకుంది. అలాగే విభిన్న బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో గోవర్ధన్, గో చీజ్, ప్రైడ్ ఆఫ్ కౌస్, అవ్వాటర్ ఉన్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానాలోని కంపెనీ అత్యాధునిక సౌకర్యాలు, నాణ్యత, ఆవిష్కరణల కోసం షా ఎంతో నిబద్ధతతో పని చేశారు.
సవాళ్లను తెచ్చిపెట్టింది
షా వ్యవస్థాపక దృష్టి పాల ప్రాథమిక అంశాలకు మించి విస్తరించింది. అధిక-ప్రోటీన్ ఆహారాలు, ఆరోగ్య-కేంద్రీకృత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించి ఆమె పరాగ్ మిల్క్ ఫుడ్స్‌ను అవ్వాటర్ వెరు ప్రోటీన్‌తో ఆరోగ్యం, పోషకాహార రంగంలోకి నడిపించింది. ‘స్పెక్ట్రం అంతటా వినూత్న ప్రోటీన్ పరిష్కారాలను అందించే అవకాశాన్ని మేము చూశాము’ అని ఆమె చెప్పింది. ఈ వ్యూహాత్మక వైవిధ్యీకరణ పరాగ్ మిల్క్ ఫుడ్స్‌ను ఆరోగ్యం, పోషకాహార సంస్థగా పరిణామం చెందింది. ఇది సాంప్రదాయ, ఆధునిక వినియోగదారులకు సేవలు అందిస్తుంది. పురుషాధిక్య పరిశ్రమలోకి ప్రవేశించడం షాకు కొన్ని సవాళ్లను తెచ్చి పెట్టింది. ‘మహిళా నాయకురాలిగా నమ్మకం, విశ్వసనీయతను సంపాదించడం అంత సులభం కాదు’ అని ఆమె పంచుకుంటుంది.
నాణ్యత పట్ల నిబద్ధత
అమ్మకాల నుండి మార్కెటింగ్‌కు కంపెనీ దృష్టిని మార్చేటప్పుడు ఆమె ప్రతిఘటనను కూడా ఎదుర్కొంది. సంస్థలో గణనీయమైన మార్పు అవసరం. ఆవిష్కరణను నడిపిస్తూ ఉత్పత్తి స్థిరత్వాన్ని కొనసాగించడం మరొక అడ్డంకి. ‘పాడి పరిశ్రమలో, నమ్మకం, సంప్రదాయం చాలా ముఖ్యమైనవి’ అని ఆమె చెప్పారు. అనుకూలత, నాణ్యత పట్ల నిబద్ధత ఈ సంక్లిష్టతలను అధిగమించడంలో ఆమెకు సహాయపడ్డాయని అన్నారు. షా నాయకత్వంలో, పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఆదాయం 2021-22లో రూ.20,256 మిలియన్ల నుండి 2023-24లో రూ.30,898 మిలియన్లకు పెరిగింది. ఈ వృద్ధిలో ఎక్కువ భాగం స్థిరమైన, వినియోగదారు -కేంద్రీకృత వ్యూహాలు, వినూత్న ఉత్పత్తికి ఆమె రుణపడి ఉందని చెప్పాలి.
రైతులుపై సానుకూలత
‘మా బలమైన మౌలిక సదుపాయాలు, అధునాతన ఆహార సాంకేతికత, విశ్వసనీయ రైతు నెట్‌వర్క్, విస్తృత పంపిణీ మార్గాల బలం మాకు పునాదిగా ఉన్నాయి. ఇది పరిశ్రమలో మాకు ఒక ముద్ర వేయడానికి సహాయపడుతుంది’ అని ఆమె పంచుకున్నారు. ఆర్థిక విజయాలకు మించి వినియోగదారులు, రైతులపై ఆమె చేసిన కృషి సానుకూల ప్రభావాన్ని చూడటంలో తాను గొప్ప సంతృప్తిని పొందానని షా చెప్పారు. ‘మేము చేసిన వినూత్న ప్రయత్నాల వల్ల రైతులు కూడా ప్రయోజనాలు పొందుతున్నారు. అలాగే మా ఉత్పత్తులను విశ్వసించే వినియోగదారులు కూడా మా బలోపేతానికి కారణమయ్యారు’ అంటూ ఆమె జతచేశారు.
ఇదే మంచి అవకాశం
వ్యవస్థాపక రంగంలో మహిళలకు ఇది సరైన సమయం అని ఆమె విశ్వసిస్తున్నారు. ‘వనరులు, సహాయక విధానాలకు పెరుగుతున్న ప్రాధాన్యతతో మహిళలు కొత్త ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిని నడిపించడానికి మంచి స్థితిలో ఉన్నారు’ అని ఆమె నొక్కి చెబుతున్నారు. నిజానికి ఆమె పాత్ర తన కంపెనీకి మించి విస్తరించింది – మహిళా వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చేందుకు, లింగ అంతరాన్ని తగ్గించేందుకు అన్ని విధాల సహాయసహరాలు అందించేందుకు, అందుకు తగ్గ వాతావరణం సృష్టించేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ‘వ్యవస్థాపక ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు తమ సామర్థ్యాలను విశ్వసించాలి, ఆత్మవిశ్వాసంతో ప్రయాణాన్ని స్వీకరించాలి. ప్రతి అడ్డంకి ఆవిష్కరణలు, అభివృద్ధికి ఒక అవకాశం’ అని ఆమె చెబుతున్నారు. ‘మహిళలు తమ పరిసరాల నుండి ప్రేరణ పొందాలి, అడ్డంకులను అధిగమించాలి, నిబంధనలను పునర్నిర్వచించాలని నేను కోరుతున్నాను’ అని ఆమె తన మాటలు ముగించారు.
– పాలపర్తి సంధ్యారాణి