అభివృద్ధి చేసిన మంచిరెడ్డికే మరోసారి పట్టం కట్టాలి

– అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే..
– బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు చీరాల రమేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏర్పుల చంద్రయ్య
నవతెలంగాణ-మంచాల
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంను అభివృద్ధి చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డికే పట్టం కట్టాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు చీరాల రమేష్‌, ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏర్పుల చంద్రయ్య నియోజక ప్రజలను కోరారు. శనివారం మండల పరిధిలోని లింగం పల్లి గ్రామంలో బూత్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ చేయని అభివృద్ధి పనులు తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని అన్నారు. అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ముఖ్యంగా గత పాలకులు ఇబ్రహీంపట్నంను మరుగున పడేశారని, మూడు పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేలా చూశారని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి తమ అమూల్య మైన ఓటును కారు గుర్తుకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బుస్సు పుల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాట్రోత బహదూర్‌, నాయకులు దండేటీకార్‌ రవి, కుకూడాల రాంరెడ్డి, ఎండి. జానీ పాషా, మైళారం ప్రభాకర్‌, గ్రామశాఖ అధ్యక్షులు పరమేష్‌, నాయకులు శ్రీరాములు, కసరమొని మహేందర్‌ యాదవ్‌, కర్ణాకర్‌ రెడ్డి, పద్మారెడ్డి, అశోక్‌, శివ, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.